తాడిపత్రి కౌన్సిల్‌ సమావేశంపై ఉత్కంఠ

తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం

       తాడిపత్రి : తాడపత్రి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉత్కంఠ నెలకొంది. బుధవారం నాడు అత్యవసర మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. గత ఆరు మాసాలుగా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించకపోవడంతో పారిశుధ్యం, తాగునీటి సమస్యలు పట్టణంలో తిష్టవేశాయి. ఈ కౌన్సిల్‌ సమావేశం ద్వారా తాడపత్రిలో నెలకొన్న సమస్యలు ప్రస్తావనికొస్తాయనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఛైర్మన్‌ జెసి.ప్రభాకర్‌ రెడ్డి హాజరవుతారా.. కారా..? అనే అంశంపై పట్టణంలో పెద్ద చర్చ నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఇరు పార్టీ నాయకులను జిల్లా పోలీసు యంత్రాంగం నియోజకవర్గ బహిష్కరణ చేసిన విషయం విధితమే. న్యాయశాఖ సైతం బహిష్కరణను సమ్మతిస్తూ జూన్‌ 28 వరకు ఇరు పార్టీ నాయకులను నియోజకవర్గంలోకి రావొద్దంటూ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో సమస్యలకు తిష్ట వేసిన తాడిపత్రి మున్సిపాలిటీని గాడిన పెట్టేందుకు మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి.ప్రభాకర్‌ రెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌కి హాజరవుతారనే చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలో తలెత్తిన గొడవల కారణంగా కొంతమంది కౌన్సిలర్లు సైతం ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారు. ఈ క్రమంలో వైసిపికి చెందిన కౌన్సిలర్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. నలుగురు వైసిపి కౌన్సిలర్లు ఎన్నికల ముందు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోయినప్పటికీ పట్టణంలోని ప్రధాన సమస్యలైన అండర్‌ డ్రైనేజీ, పారిశుధ్యం, పచ్చదనం సంరక్షణ, తాగునీరు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని గాడిలో పెట్టేందుకు తీర్మానాలు చేసేలా ఛైర్మన్‌ ఆధ్వర్యంలో సమావేశంలో చర్చ నడుస్తుందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

➡️