ధరలను నియంత్రించడంలో బిజెపి విఫలం : సిపిఎం

 అనంతపురం టవర్‌ క్లాక్‌ వద్ద మెడలో కూరగాయల హారాన్ని వేసుకుని నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : పదేళ్లుగా పరిపాలన సాగిస్తున్న బిజెపి ప్రభుత్వం నిత్యావసరాలు, కూరగాయల ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని సిపిఎం నాయకులు విమర్శించారు. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకులు, కూరగాయ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సాయంత్రం అనంతపురం టవర్‌ క్లాక్‌ దగ్గర సిపిఎం ఒకటవ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కూరగాయల హారాన్ని మెడలో తగిలించుకుని వినూత్నంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం ఒకటవ నగర కార్యదర్శి వి.రామిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. పెట్టుబడిదారులకు ఊడిగం చేయడమే నరేంద్ర మోడీకి తెలిసిన పాలన అని విమర్శించారు. కార్పొరేట్లు నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని పంటలను పండించి అధిక ధరలకు అమ్ముకునేలా కేంద్ర ప్రభుత్వం వారికి సహకారాలు అందిస్తోందన్నారు. రైతులను విస్మరించి కార్పొరేట్‌కు మాత్రం అన్ని విధాలా సాయం అందిస్తోందని విమర్శించారు. రైతులను వ్యవసాయం నుంచి దూరం చేయడమే బిజెపి పాలనలా ఉందన్నారు. వ్యాపారుల కోసం కృత్రిమ కొరతను సృష్టించి కావాలనే సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలపై ధరాభారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కోల్డ్‌ స్టోరేజ్‌, గోడౌన్లో వ్యాపారులు అక్రమంగా నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులను బయటకు తీయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూరగాయలను రైతు బజార్లలో ప్రభుత్వమే తక్కువ ధరలకు విక్రయించాలని కోరారు. బ్లాక్‌ మార్కెట్లలో అమ్ముతున్న వ్యాపారస్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు వెంకటనారాయణ, ప్రకాష్‌, వలీ, బాలకృష్ణ, మసూద్‌, శీనా, ఎర్రిస్వామి, నూరుల్లా, లక్ష్మీనారాయణ, డేవిడ్‌, మురళి పాల్గొన్నారు.

➡️