అంగన్‌వాడీల ఆగ్రహజ్వాల

సమ్మె సందర్భంగా గుంతకల్లులో రాస్తారోకో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు

      అనంతపురం కలెక్టరేట్‌ : న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలను వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నాటికి సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఆయా మండల కేంద్రాల్లో అంగన్‌వాడీలు రాస్తారోకో, భిక్షాటన, వంట వార్పు తదితర రూపాల్లో నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం శిబిరానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి సమ్మెకు మాజీ మంత్రి పరిటాల సునీత మద్దతుగా హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీలు 11 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మొండిగా వ్యవహరించడం దుర్మార్గంగా ఉందన్నారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల హక్కులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే మరో మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని, అప్పుడు తమ అధినేత చంద్రబాబు నాయుడు ద్వారా న్యాయం చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, గోపాల్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నగర అధ్యక్ష, కార్యదర్శులు జయ భారతి, జమున, అరుణ, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

➡️