అనంతలో సిపిఎం, జనసేన, టిడిపి మద్దతు

అనంతపురం కలెక్టరేట్‌ వద్ద సమ్మెలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు

          అనంతపురం కలెక్టరేట్‌ : తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు ఇస్తామని పాదయాత్ర సందర్భంగా అంగన్‌వాడీలకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎం, టిడిపి, జనసేన, సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండవ రోజుకు చేరుకుంది. అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి జమున అధ్యక్షత నిర్వహించిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలరంగయ్య, జిల్లా నాయకులు ఆర్‌వి.నాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్‌, జిల్లా ఉపాధ్యక్షులు పత్తి చంద్రశేఖర్‌, జయరామిరెడ్డి, రాయలసీమ రీజినల్‌ ఉమెన్‌ కో-ఆర్డినేటర్‌ పెండ్యాల శ్రీలత, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు లక్ష్మి నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నాగభూషణం, సిఐటియు జిల్లా కోశాధికారి గోపాల్‌ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీలు న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞాపన పత్రాలు అందజేశామన్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలిపామన్నారు. నాలుగున్నరన సంవత్సరాలుగా ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. గ్రాట్యూటీ, అమలు చేయాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, సెంటర్‌ అద్దెలు చెల్లించాలని అడుగుతూనే ఉన్నామని తెలిపారు. అంగన్‌వాడీలు అప్పులు చేసి సెంటర్‌ అద్దెలు చెల్లిస్తున్నామన్నారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేకనే నిరవధిక సమ్మె చేపట్టాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. సమ్మె చేస్తే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామనే పద్ధతుల్లో అధికారులు బెదిరించడం అన్యాయంగా ఉందన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. సిపిఎం జిల్లా నాయకులు ఆర్‌వి.నాయుడు మాట్లాడుతూ మహిళా పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకేనే ముఖ్యమంత్రికి అంగన్‌వాడీలు రోడ్డు ఎక్కి నిరసన చేస్తుంటే కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ ఇవ్వాలన్నారు. 6 నెలలుగా బకాయి పడ్డ సెంటర్‌ అద్దెలు, టిఏ, డిఏలు బిల్లులు తక్షణం చెల్లించాలన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు కంటే రాష్ట్రంలో అంగన్‌వాడీలకు పెంపుదల చేస్తామన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలన్నారు. టిఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం నాగభూషణం మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు రోజున నారా లోకేష్‌ అంగన్‌వాడీలకు సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వబోతున్నారని తెలిపారు. ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరిస్తే భయపడొద్దని టిడిపి ప్రభుత్వంలో తప్పకుండా అంగన్‌వాడీలకు న్యాయం జరుగుతుందన్నారు. సమ్మెకు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు లక్ష్మినరసమ్మ, తిరుమలేష్‌, జనసేన పార్టీ నగర అధ్యక్షులు బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు పత్తి చంద్రశేఖర్‌, ఈశ్వరయ్య, నాగేంద్ర, టిఎన్‌టియుసి వంకదారి వెంకటక్రిష్ణ, పూల బాషా తదితరులు మద్దతుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్టీఆర్‌ శ్రీనివాసులు, ఆది, పోతులయ్య, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు అరుణ, విజయభారతి, నక్షత్ర, రుక్మిణి, ఐఎఫ్‌టియు నాయకులు ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️