ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఆందోళన చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-గుంతకల్లు

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం పట్టణంలోని భగత్‌సింగ్‌ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల ఎదుట నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో అనేకమార్లు ఆందోళనలు చేశామన్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 30న రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహిస్తే స్పందించిన విద్యాశాఖ అధికారులు యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులను చర్చలకు పిలిచి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినా పరిష్కరించిన పాపానపోలేదన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 25న విజయవాడలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్ర కేంద్రంలో భద్రతా సమస్య వస్తుందనే కారణంతో అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ పట్టణ గౌరవాధ్యక్షులు మల్లికార్జున, ఉపాధ్యక్షులు రమేష్‌, కోశాధికారి యల్లన్న, రూరల్‌ ప్రధాన కార్యదర్శి కల్పన, పట్టణ కార్యదర్శులు సుధాకర్‌, వెంకటేష్‌, తిమ్మారెడ్డి, విశ్వేశ్వరబాబు, రామ్మోహన్‌, రమేష్‌, చలపతి, పెన్నయ్య, పెద్దయ్య, గురునాథ్‌, భాస్కర్‌, నామేనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️