ఎన్నికలకు అన్ని విధాలా సంసిద్ధం

వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ

         అనంతపురం : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ ఎం.గౌతమి, ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌ తెలియజేశారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి బుధవారం నాడు ఎన్నికల సంసిద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఫామ్‌ 6, 7, 8 ఫిర్యాదులకు సంబంధించి ఎప్పటికప్పుడు విచారణ చేసి పరిష్కరిస్తున్నామని, ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. జిల్లాకు 2,38,849 ఎపిక్‌ కార్డులు వచ్చాయన్నారు. ఎపిక్‌ కార్డులను ఓటర్లకు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్వో జి.రామకృష్ణారెడ్డి, కలెక్టరేట్‌ కోఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, ఎలక్షన్‌ సెల్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ శ్యాముల్‌, పాల్గొన్నారు.

➡️