ఎన్నికలకు అన్ని విధాలా సన్నద్ధం కావాలి

అధికారులతో మాట్లాడుతున్న ఎం.గౌతమి

            అనంతపురం : సాధారణ ఎన్నికల కోసం అన్ని విధాలా సన్నద్ధం కావాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం నాడు రిటర్నింగ్‌ అధికారులతో సాధారణ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, జిల్లా పరిషత్‌ సీఈవో వైఖోమ్‌ నిదియా దేవి, నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్కోర్‌ను బలోపేతం చేశామన్నార. ఈ విషయాన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయాలని, ఎక్కడా ఎంసిసి ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు. రాజకీయ పార్టీల ప్రచారం, సమావేశాల, వాహనాలు, లౌడ్‌ స్పీకర్‌, తదితర అన్ని వాటికి అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్కోర్‌ యాప్‌ దరఖాస్తులకు నిర్ధేశిత సమయంలోగా రిటర్నింగ్‌ అధికారులు అనుమతులు ఇవ్వాలన్నారు. క్యాండిడేట్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేసుకుని ఎన్కోర్‌ యాప్‌, అనుమతులపై అభ్యర్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో పోలింగ్‌ పర్సనల్‌కు సంబంధించి శిక్షణ నిర్వహించాలని, ఏప్రిల్‌ 12 నుంచి 15వ తేదీలోగా ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమాలు విస్తతంగా చేపట్టాలన్నారు. పోలింగ్‌ పర్సనల్స్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునేలా ఆర్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రిటర్నింగ్‌ అధికారులు జి.వెంకటేష్‌, రాణిసుస్మిత, కరుణకుమారి, వెన్నెల శీను, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, నోడల్‌ అధికారి ఉమామహేశ్వరమ్మ, డిప్యూటీ కలెక్టర్‌ విశ్వనాథ్‌, ఎన్‌ఐసి డిఐఒ రవిశంకర్‌, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

➡️