ఎన్నికల నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌ ఎం.గౌతమి

రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

          అనంతపురం కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉంటుందని కలెక్టర్‌ ఎం.గౌతమి తెలియజేశారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం సాయంత్రం సాధారణ ఎన్నికలు – 2024పై జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కోసం జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్‌ రూమ్‌ 24 గంటల పాటు పనిచేస్తుందని, ప్రతి ఆర్‌ఒ వద్ద కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. 1950, టోల్‌ ఫ్రీ నెంబర్లు 1800-4258802, 1800-4258803, 1800-4258804కు డబ్బు పంచుతున్నా, ఓటర్లను ప్రలోభ పెడుతున్నా, ఇతర ఎన్నికలకు సంబంధించి ఏ సమస్య ఉన్న ఫోన్‌ చేయవచ్చన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు 08554-231722, 08554-231922, 08554-232922లకు ఏవైనా ఫిర్యాదులు తెలపవచ్చన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ కూడా మూడు షిఫ్టుల్లో పని చేస్తోందన్నారు. సీ-విజిల్‌ యాప్‌లో ఎంసీసీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైన చేయవచ్చని తెలియజేశారు. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, అడిషినల్‌ ఎస్పీలు విజరు భాస్కర్‌ రెడ్డి, రామకృష్ణ, రిటర్నింగ్‌ అధికారులు జి.వెంకటేష్‌, రాణిసుస్మిత, వెన్నెల శీను, వి.శ్రీనివాసులు రెడ్డి, డీఎస్పీలు ఆంథోనప్ప, వీరరాఘవరెడ్డి, కలెక్టరేట్‌ ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️