ఎన్నికల బాండ్లలో బిజెపి కుట్ర : సిపిఎం

అనంతపురం ఎస్‌బిఐ బ్యాంకు వద్ద నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : ఎన్నికల బాండ్ల విషయంలో బిజెపి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని సిపిఎం నాయకులు విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్నికల బాండ్‌ల వివరాలను ఎస్‌బిఐ తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఎస్‌బిఐ బ్యాంకుల వద్ద సోమవారం నాడు ఆందోళనలు చేపట్టారు. అనంతపురం ఎస్‌బిఐ సాయినగర్‌ ప్రధాన బ్రాంచ్‌ వద్ద జరిగిన ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, సీనియర్‌ నాయకులు జి.ఓబులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్‌బిఐ ప్రకటించకపోవడం అభ్యంతకరంగా ఉందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వ్యవస్థను మరింత భ్రష్టు పట్టించిందని విమర్శించారు. 2017లో ఎన్నికల బాండ్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలను అక్రమంగా తమ ఖాతాలోకి వేసుకుందని విమర్శించారు. విశ్వసనీయత, పారదర్శకత గురించి మాట్లాడే బిజెపి నాయకులు ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటి వరకు స్పందించకపోవడం దాని మోసకారి వైఖరికి నిదర్శనం అన్నారు. ఎన్నికల బాండ్లు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమని సిపిఎం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిందన్నారు. దాని ఫలితంగా గత ఫిబ్రవరి నెలలో తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్లను తక్షణమే రద్దు చేయాలని మార్చి 6వ తేదీ లోపు ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు అందించాలని, మార్చి 13వ తేదీ నాటికి ఏ ఏ పార్టీకి ఎంత మొత్తంలో ఈ బాండ్లు అందాయో ఆన్‌లైన్‌లో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. అయితే ఆ తీర్పును అమలు చేయకుండా జూన్‌ 30 వరకు తనకు సమయం కావాలని ఎస్‌బిఐ ద్వారా కోర్టులో పిటిషన్‌ వేయించడం వెనక బిజెపి హస్తం ఉందన్నారు. ఎన్నికల బాండ్ల వల్ల అత్యధికంగా లాభపడింది బిజెపి అనే విషయం బయటకు వస్తే ఎన్నికల ముందు తన నిజ స్వరూపం బట్టబయలవుతుందని ఆ పార్టీ భయపడుతోందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేయడం వెనక ఈ అక్రమ డబ్బు ప్రభావం ఉందన్నారు. అలాగే వేల కోట్ల రూపాయలను ఎన్నికల కోసం ఖర్చు పెట్టడం, ప్రత్యర్థి పార్టీలను భయపెట్టడం అందులోని నాయకులను కొనుగోలు చేయడం అక్రమంగా అధికారాన్ని అనుభవించడం బిజెపి నైజం అని విమర్శించారు. ఎస్‌బిఐ ఉన్నతాధికారులు ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎం.బాల రంగయ్య, నగర కార్యదర్శి వి.రామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌ రెడ్డి, న్యూ టౌన్‌ కార్యదర్శివర్గ సభ్యుడు ఇర్ఫాన్‌, ప్రకాష్‌, పోతులయ్య, బాలకష్ణ పాల్గొన్నారు.

➡️