కరువు సహాయక చర్యలు చేపట్టాలి

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

సచివాలయ అధికారి భానుప్రకాష్‌కి వినతిపత్రం సమర్పిస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు

ప్రజాశక్తి-ఆత్మకూరు

మండలంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఎపి రైతుసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శనివారం మండల కేంద్రంలోని సచివాలయ-2లో అధికారి భానుప్రకాష్‌కు ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం మండల కార్యదర్శి రాము మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారన్నారు. కావున రైతుల అప్పులు మాఫీ చేయాలని, పంట నష్ట పరిహారం కౌలు రైతులకు కూడా అందించాలని, వలసల నివారణకు ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించి రోజు కూలి రూ.600 ఇవ్వాలని కోరారు. మరోవైప హెచ్‌ఎల్‌సి హంద్రీనీవా కాలువ కింద వేసిన మిరప, మొక్కజొన్న, తదితర పంటలు చేతికి వచ్చే సమయంలో నీటిని బంద్‌ చేయడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. పంటలు పూర్తయ్యే వరకూ నీరు ఇవ్వాలనే రైతుల డిమాండ్‌ చేసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఉదారంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించినా సహాయ చర్యలను చేపట్టడం లేదన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు, మిరప పంటకు ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శివశంకర్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ఎన్‌పిఆర్‌డి జిల్లా కార్యదర్శి రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️