కేంద్రమే రైతు శుభకరణ్‌ సింగ్‌ను చంపింది..!

అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న సిఐటియు, ఎఐటియుసి, రైతుసంఘాల నాయకులు

      అనంతపురం కలెక్టరేట్‌ : రైతుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో రైతు సంఘాలు చేపట్టిన ఉద్యమంలో యువరైతు శుభకరణ్‌ సింగ్‌ పోలీసుల కాల్పుల్లో మరణించాడని, ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ హత్యగా భావిస్తున్నట్లు సిఐటియు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎస్‌.నాగేంద్రకుమార్‌, వై.రాజారెడ్డిలు తెలిపారు. రైతు శుభకరణ్‌సింగ్‌ మృతికి కారుకులైన వారిని శిక్షించాలని, ఎంఎస్‌.సామినాథన్‌ సిఫార్సులు అమలు, రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ వామపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం నాడు నిరసన తెలిపారు. రైతు, కార్మిక జెండాలు, ప్లకార్డులు చేతబట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నాగమణి, ఎస్‌.నాగేంద్రకుమార్‌, ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేష్‌ గౌడ్‌, రాజారెడ్డి, ఏపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఢిల్లీ రైతు ఉద్యమంపై బిజెపి ప్రభుత్వ ధమనకాండ సాగిస్తూ రైతును బలి తీసుకుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక, రైతుసంఘాలు ఢిల్లీ హర్యానా సరిహద్దులో రైతు ఉద్యమం సందర్భంగా గతంలో రైతులకు ఇకిచ్చిన హామీలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అందుకు నిరసనగా రెండో విడత రైతాంగం శాంతియుతంగా రైతు సమస్యలను ప్రభుత్వం దష్టికి తెచ్చేందుకు ఢిల్లీకి వెళ్తేంటే బిజెపి ప్రభుత్వం రైతులపై అత్యంత కర్కశంగా పోలీసుల చేత కాల్పులు జరిపించిందన్నారు. ఈ కాల్పుల్లో యువ రైతు శుభ కరణ్‌ సింగ్‌ మరణించాడం అత్యంత బాధాకరం అన్నారు. హామీలు అమలు చేయకుండా నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బ్లాక్‌డేగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు రైతులు పండించే అన్ని పంటలకు డాక్టర్‌ ఎంఎస్‌.స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు ప్రకటించాలన్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ బిల్లు 2020ను ఉపసహరించుకోవాలన్నారు. గత రైతు ఉద్యమంలో మృతి చెందిన అమరవీరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. రైతు ఉద్యమంలో రైతు నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. యువ రైతు కరణ్‌ సింగ్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వెంకట నారాయణ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు, సిఐటియు నాయకులు ప్రకాష్‌, ఆదినారాయణ, సురేంద్ర, ఆజాం బాషా, మంత్రి వరలక్ష్మి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు బి.చంద్రశేఖర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️