గ్రామాల్లో ‘ఉపాధి’ కల్పించండి : వ్యకాసం

డ్వామా కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వ్యకాసం నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల్లో వెంటనే పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.సూరి, ఎం.క్రిష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడు అనంతపురం డ్వామా కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం పేదలకు వరంలా నిలిచిందన్నారు. నాలుగు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి పూనుకుని కొత్త నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా నెలల తరబడి నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆరు వారాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తక్షనమే బకాయి బిల్లులు చెల్లించాలన్నారు. పనిముట్లు, సమ్మర్‌ అలవెన్స్‌లు, అదనపు వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలన్నారు. 100 రోజులు పూర్తైన వారికి అదనపు పనిదినాలు కల్పించాలన్నారు. 200 రోజులు పనులు కల్పించి రోజువారి కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు భాస్కర్‌, కృష్ణ, నారాయణ, రంగస్వామి, నాగప్ప, నాగ లింగయ్య, కరీం, పెద్దయ్య, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️