చెత్తదిబ్బల మధ్య కుట్టు శిక్షణ కేంద్రం

చెత్తదిబ్బల మధ్య కుట్టు శిక్షణ కేంద్రం

కుట్టు శిక్షణ కేంద్రం వద్ద చెత్తకుప్పను చూపుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

ప్రజాశక్తి-రాయదుర్గం

రాయదుర్గం నియో జకవర్గంలో ఎంతో ఉన్నతాశయంతో మహిళల ఉపాధి కోసం ‘పుర’ పథకం కింద ప్రారంభించిన కుట్టు శిక్షణ కేంద్రం (కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌) చెత్తదిబ్బల మధ్య దీనంగా దర్శనమిస్తోందని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. సెల్ఫీ ఛాలెంజిలోలో భాగంగా సోమవారం పట్టణంలోని చెత్తకుప్పల మధ్య ఉన్న కుట్టు శిక్షణ కేంద్రం వద్ద సెల్ఫీ దిగి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గార్మెంట్స్‌ పరిశ్రమకు రాయదుర్గం ప్రసిద్ధి చెందిందన్నారు. పూర్వం చేనేత పరిశ్రమను నమ్ముకుని ఇక్కడి ప్రజలు జీవనం సాగించేవారన్నారు. ఈసమయంలో చేనేత పరిశ్రమకు గడ్డు కాలం దాపురించి మగ్గాలన్నీ మూతబడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా దుస్తుల తయారీని ఇక్కడి వారు ఎంచుకున్నారన్నారు. ప్రస్తుతం వేలాది కుటుంబాలు రాయదుర్గంలో దుస్తుల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. ఈరంగంలో మహిళలకు వృత్తి నైపుణ్యం పెంచడంతోపాటు స్వయం ఉపాధి కల్పించాలని గతంలో ‘పుర’ పథకం కింద భవనాన్ని నిర్మించారని గుర్తు చేశారు. అంతేగాకుండా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టాటా సంస్థను ఒప్పించి వారి అధ్వర్యంలో కుట్టు శిక్షణ, దుస్తుల తయారీ కేంద్రాన్ని నిర్వహించామన్నారు. అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్ధాక్షిణంగా ఈ కేంద్రాన్ని మూసేసిందన్నారు. ప్రస్తుతం ఈ భవనాన్నా విప్‌ కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు గోడౌన్‌గా ఉపయోగించుకుంటున్నాడన్నారు. వేలాది మందికి ఉపయోగపడాల్సిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ‘కాపు’ తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు. గార్మెంట్స్‌ కార్మికులపై అతనికి ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. వెంటనే ఈ చెత్త ప్రభుత్వాన్ని దింపేయడానికి అందరూ ఐకమత్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

➡️