టిడిపి కంచుకోటపై వైసిపి కన్ను

Jan 7,2024 21:51

హిందూపురం అసెంబ్లీ పరిధి చిత్రపటం

                      హిందూపురం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో హిందూపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. టిడిపి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని కోట ఏదైనా ఉంది అంటే అది హిందూపురం నియోజకవర్గం అని చెప్పవచ్చు. అయితే ఈసారి జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కంచుకోటపై వైసీపీ జెండా ఎగురవేయాలన్న సంకల్పంతో వైసీపీ రాయలసీమ కోఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నుంచి ఆరు రోజుల పాటు నియోజకవర్గంలో పట్టణం నుంచి పంచాయితీ వరకు కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరినీ కలవనున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పటికే నియోజకవర్గంలో మాకాం వేశారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు హిందూపురం పురపాలక సంఘం, రూరల్‌ మండల వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీంతో హిందూపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పెట్టని కోటగా ఉంటున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థులే గెలుపొందుతూ వస్తున్నారు. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార వైసిపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక నాయకుల్లో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరడంతో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. తెలుగుదేశం పార్టీని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు ఓడిస్తారన్న కోణంలో కూడా తాజాగా అధికార పార్టీ సర్వేలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన సవీన్‌ నిశ్చల్‌ వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు సాగించారు. ఇందులో భాగంగా విజయవాడలోనే మకాం వేసి టికెట్‌ కోసం జోరుగా ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ప్రస్తుత సమన్వయకర్త దీపిక అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుట్లు పార్టీలో చర్చ సాగుతోంది. మైనార్టీలకే టికెట్‌ దక్కేలా పావులు కదిపి వైసిపి సీనియర్‌ నాయకుడు కట్లబాషా పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. దీనికి తోడు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ చైర్మన్‌ బలరాం రెడ్డి కూడా టికెట్‌ కోసం తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మళ్లీ నందమూరి బాలకృష్ణనే ఇక్కడి నుండి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనకు ధీటుగా ఎవరిని బరిలోకి దింపాలన్న కోణంలో వైసిపి అధిష్టానం దృష్టిసారించినట్లు సమాచారం. ఓవైపు పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్‌ పోటీ చేస్తున్నట్లు స్పష్టం కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త దీపికకు ఇస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. సత్యసాయి జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలకు అసెంబ్లీ టికెట్లను ఇచ్చే అవకాశాలు ఉంటాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 1983 నుండి స్థానిక అసెంబ్లీ నియోజకవర్గం తరఫున టిడిపి అభ్యర్ధులే విజయం సాధిస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2024 ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. 1983లో టిడిపి అభ్యర్థి రంగనాయకులు, 1984లో జరిగిన ఉప ఎన్నికల్లో 1999, 1904 సాధారణ ఎన్నికల్లో టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఘన విజయం సాధించారు. ఎన్టీఆర్‌ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2004 అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హవాలో సైతం స్థానిక టిడిపి అభ్యర్థి పామిశెట్టి రంగనాయకులు విజయం సాధించగా 2009 ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థి అబ్దుల్‌ ఘనీ విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగా ఇక్కడ మాత్రం టిడిపి అభ్యర్థులే గెలవడం గమనార్హం. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. టిడిపికి ఓటమి లేని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలని తాజాగా వైసిపి అధిష్టానం ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. అయితే పార్టీలోని స్థానిక నాయకుల్లో నెలకొన్న గ్రూపు తగాదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పులు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో గ్రూపు తగాదాలపై తాజాగా అధిష్టానం దృష్టి సారించింది. ఇప్పటికే దీపికను అభ్యర్థిగా అధిష్టానం పరోక్షంగా ప్రకటించినప్పటికీ కొందరు టికెట్ల కోసం ప్రయత్నాలను చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణకు ఎవరు గట్టి పోటీ ఇస్తారన్న కోణంలో కూడా తాజాగా సర్వే చేస్తున్నట్లు సమాచారం. అయితే రీజినల్‌ కోఆర్డినేటర్‌, సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని టిఎన్‌ దీపికను హిందూపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అభ్యర్థి మార్పు అంత సులభంగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఓటమి ఎరుగని కోటలో వైసిపి ఏస్థాయిలో ఢకొీడుతుందో వేచిచూడాలి. ఐక్యంగా కలిసి వస్తారా..?నాడు కాంగ్రెస్‌ పార్టీ…. నేడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వర్గ విభేదాలతోనే హిందూపురం నియోజకవర్గ టిడిపికి కంచుకోటగా మారింది. అయితే నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రూపులను ఒకే తాటిపైకి తీసుకురావాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేస్తున్న పాచికలు పారుతాయా లేదా అన్న వ్యాఖ్యానాలు రాజకీయ విశ్లేషకుల్లో వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం నుంచి మండలానికి రెండు రోజుల చొప్పున కేటాయించి ఆరు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గత 20 రోజుల నుంచి మంత్రి వ్యక్తిగత కార్యదర్శి తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు నియోజకవర్గంలో ఉన్న నేతలందరినీ కలిశారు. వారు గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో మంత్రి తన పర్యటనను ఖరారు చేసుకున్నారు. అయితే దీపిక అభ్యర్థిత్వాన్ని పార్టీ సీనియర్‌ నాయకులు, ఏపీ అగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ తో పాటు ఎమ్మెల్సీ షేక్‌ మొహమ్మద్‌ ఇక్బాల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, ఇతర ముఖ్య నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్న నేతలందరూ ఐక్యంగా కలిసి వస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి ఎదుట అందరూ కలిసి వచ్చినప్పటికీ ఎన్నికల సమయంలో కలిసి వచ్చి పని చేస్తే మంత్రి పాచికలు పారే అవకాశం ఉంది. పురంలో వేడెక్కిన రాజకీయం ఒకపక్క స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరోపక్క అధికార పార్టీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పర్యటించనుండటంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పట్టు నిలబెట్టుకోవాలని బాలకృష్ణ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. మరోపక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఉన్న గ్రూపులు అన్నింటిని ఒకే తాటిపైకి తెచ్చి ఎలాగైనా పట్టు సాధించాలని ముందుకు సాగుతున్నారు. దీంతో ఇప్పుడే నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం నెలకొంది.

➡️