తండాల్లో మౌలిక వసతులు కల్పించాలి : కలెక్టర్‌

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

           పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలోని వివిధ గిరిజన తండాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా, వారి సామాజిక ఆర్థిక అభివద్ధి సంక్షేమం పరిరక్షణకు సంబంధిత అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు ఆదేశించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారా సేవా సంఘం ప్రతినిధులు ఇచ్చిన వినతులపై గురువారం స్థానిక కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, గిరిజన సంక్షేమ అధికారి మోహనరావు, బంజారా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గిరిజన తండాల ప్రజలు ఎక్కువగా ఉన్నారని క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు వివిధ మండలాలలో తిరిగి వారికి అవసరం ఉన్న మౌలిక వసతులను గుర్తించి వారి సంక్షేమ అభివద్ధికి తగిన ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. సురక్షితమైన తాగునీరు అందించేలా ప్రతి ఇంటికీ కుళాయి కలెక్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు. తండాల అభివృద్ధి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో సిసి రోడ్లుతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం ఆదేశించిన జీవో ప్రకారం బంజారా భవన్‌, లేక గిరిజన భవన నిర్మాణాలకు స్థల సేకరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అఖిలభారత బంజారా సంఘం ప్రధాన కార్యదర్శి చక్రే నాయక్‌, జిల్లా కార్యదర్శి కాలే నాయక్‌, అదనపు కార్యదర్శి రంగనాథ నాయక్‌, ధర్మవరం ఆర్డీవో వెంకట శివసాయి రెడ్డి, హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️