‘న్యూ’ తనోత్సహం

Dec 31,2023 22:14

 

అనంతపురం ప్రతినిధి : కాలగమనంలో మరో సంవత్సరం కలసిపోయింది. ‘కొత్త’ ఆశలు మొలకెత్తాయి. ఆకాంక్షలు ఊగిసలాడాయి. వ్యాపకాలు దారి మార్చుకున్నాయి. సాధ్యాసాధ్యాలను పక్కనబెడితే మనసు కొత్త ఉత్సాహంతో సందడి చేసింది. కొత్త కాంతులు.. కోటి ఆశలతో ‘న్యూ’తనోత్సహం నెలకొంది. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం పలుకుతూ అందరిలోనూ జోష్‌ కనిపించింది. గతేడాది కష్టాలు ఒక జ్ఞాపకంగా వదిలేసి… ఆశల అడుగులు ఆగకుండా గుండెనిండుగా 2024కు ఉమ్మడి జిల్లా వాసులు స్వాగతం పలికారు.

2023 సంవత్సరంలోని చేదు,తీపి జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ 2024కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వాగతం పలికారు. పాతేడాదికి వీడ్కోలు.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నాడు అర్థరాత్రి వరకు వేడుకలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకలను సంబరంగా జరుపుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. నగరాలు, పట్టణాల్లో హోటళ్లు, బేకరీలు, స్వీట్‌ షాపులు పెద్దఎత్తున అలకరించబడ్డాయి. ఆఫర్లు సైతం పెద్దఎత్తున ప్రకటించారు. కొన్ని సంస్థలైతే నూతన సంవత్సరం వేడుకలను పురష్కరించుకుని ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించాయి. స్నేహితులు, సన్నిహితులు వారికి అనువైన ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు వేడుకలు జరుపుకుని కేక్‌లను 12 గంటల సమయంలో కట్‌ చేసుకుని నూతన సంవత్సరం శుభకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో అన్ని ప్రధాన పట్టణాల్లోనూ అర్ధరాత్రి వరకు సందడి నెలకొంది.

కలసిరాని 2023

       2023 సంవత్సరం పెద్దగా కలసిరాలేదు. ప్రకృతి పరంగా చూసుకున్నా.. అభివృద్ధి పరంగా చూసుకున్నా సామాన్యులు ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. 2022లో అధిక వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతే 2023 సంవత్సరం వర్షాభావం వ్యవసాయాన్ని కుదేలే చేసింది. 30 శాతానికిపైగా రెండు జిల్లాల్లోనూ వర్షాభావం నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 49 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ కరువు ప్రభావం నూతన సంవత్సరం 2024లోనూ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాగునీరు కూడా ఈసారి తక్కువగా రావడంతో ఆయకట్టు కింద సాగు చేసిన మిర్చి రైతులకు నూతన సంవత్సరంలోనూ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

రాజకీయ వేడి

        నేడు మొదలయ్యే 2024 సంవత్సరంలో ఎన్నికలు రానున్నాయి. ఈ ప్రభావం 2023 ఆఖరు నుంచే మొదలైంది. రాబోయే ఎన్నికలు కొన్ని నెలలు మాత్రమే ఉండటంతో గడిచిన రెండు, మూడు మాసాలుగా రాజకీయ వాతవరణం వేడెక్కి ఉంది. ఇక ఈ రోజుతో ఇవి మరింత వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. ఇక నెలల నుంచి రోజుల్లోకి ఎన్నికల సమయం లెక్కించాల్సి ఉంటుంది. 2024 సంవత్సరం మాత్రం కొంత మంది రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ధేశించనుంది. రాజకీయ నేతలతో ఈ సంవత్సరం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న సంవత్సరం కానుంది. ఇక ఎన్నిలకు దగ్గరపడుతున్న కొద్ది కార్మిక పోరాటాలు పెరుగుతున్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున పోరాటాలకు దిగారు. ఆదా నేటితో మరింత పదునెక్కనున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

➡️