పక్కాగా ఓటర్ల నమోదు : కలెక్టర్‌

పక్కాగా ఓటర్ల నమోదు : కలెక్టర్‌

ఓటు నమోదుపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు

     కదిరి టౌన్‌ : ఓటర్ల నమోదులో ఎలాంటి సమస్యలూ లేకుండా పక్కాగా జాబితాను తయారు చేసేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు. మంగళవారం కదిరి ఆర్డీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో కదిరి డివిజన్‌ పరిధిలోని సహఎన్నికల అధికారులు, డివిజన్‌ స్థాయి అధికారులు, బీఎల్వోలతో పెండింగ్‌ క్లెయిమ్‌ల పరిష్కారంపై సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, కదిరి ఆర్డీవో వంశీకష్ణ డివిజన్‌ పరిధిలోని తాహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు అందించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. బల్క్‌గా అందిన దరఖాస్తులపై ఎన్నికల కమిషన్‌ నిబంధనలను అనుసరించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే పరిష్కారం చేయాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటూ జాబితా నుంచి తొలగించేందుకు వీల్లేదన్నారు. చేర్పులు, తొలగింపులు, మతులకు సంబంధించి బిఎల్‌వోలు రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ఎవరైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తమ ఓటును మార్చుకోదల్చినప్పుడు కూడా పూర్తి వివరాలను తీసుకోవాలన్నారు. ఫారం-7 విషయంలో ఎటువంటి అనుమానాలు వచ్చినా తిరస్కరించ వచ్చన్నారు. ఫారం-6 విషయంలో తగిన ధ్రువీకరణలు సమర్పించాలన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బూత్‌ స్థాయి అధికారులు ఓటరు చేర్పులు, తొలగింపులు, మార్పులు చేయడానికి ఎన్నికల కమిషన్‌ సూచనలను తప్పక పాటించాలని తెలిపారు. డిసెంబర్‌ 9వ తేదీలోపు ఎన్నికల క్లైమ్స్‌ను స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరిబాబు, తహశీల్దార్లు సునీత, అమిద్‌బాషా, నరేంద్ర కుమార్‌, రవికుమార్‌, శోభరాణి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

➡️