పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా పాలిటెక్నిక్‌ కళాశాల భవనం

పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా పాలిటెక్నిక్‌ కళాశాల భవనం

పాలిటెక్నిక్‌ కళాశాల భవనం వద్ద సెల్ఫీ వీడియో తీసుకుంటున్న కాలవ శ్రీనివాసులు

 

ప్రజాశక్తి-రాయదుర్గం

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం విద్యారంగాన్ని సర్వనాశనం చేసిందని, సంస్కరణల పేరుతో పాఠశాలల సంఖ్యను కుదించి నిరుపేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం కాలవ పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాల దుస్థితిపై 45వ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. వైసిపి ప్రభుత్వం సాంకేతిక విద్యను భ్రష్టు పట్టించిందన్నారు. స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో చంద్రబాబు ప్రభుత్వం రూ. 4 కోట్లతో అదనపు భవనాలు నిర్మించిందన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఈ భవనాన్ని వైసిపి ప్రభుత్వం ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కొత్త భవనంలో విద్యార్థులకు ఉపయోగ పడే అదనపు తరగతులు, హాస్టల్‌, లైబ్రరీని ఎందుకు వినియోగించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. పాలకుల నిర్లక్ష్యానికి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల భవనమే సజీవ సాక్ష్యమని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

➡️