ప్రభుత్వ విద్య నిర్వీర్యం : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రభుత్వ విద్య నిర్వీర్యం : ఎస్‌ఎఫ్‌ఐ

సభలో ప్రసంగిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్‌

       కళ్యాణదుర్గం : కేంధ్ర, ర్రాష్ట ప్రభుత్వాలు పనికిరాని జీవోలు తీసుకొచ్చి దేశం, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలో రెండు రోజుల పాటు జరగనున్న ఎస్‌ఎఫ్‌ఐ 31వ జిల్లా మహాసభలు బుధవారం నాడు ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు పట్టణంలోని వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ కోరుతూ ర్యాలీలో విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఓతూరు పరమేష్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ , రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక నూతన జాతీయ విద్యావిధానం పేరుతో విద్యను ప్రైవేటీకరణ చేయడానికి యత్నిస్తున్నాయన్నారు. ఇందుకు నిదర్శనంగానే జీవో:77ను ప్రవేశపెట్టి బీసీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు రాకుండా ప్రభుత్వాలు కుట్ర చేశాయని మండిపడ్డారు. విభిజన హామీల్లో భాగంగా అనంతపురం జిల్లాలో సెంట్రల్‌యూనివర్శిటీ పూర్తి చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకు సొంతభవనాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వీటిని చూస్తే ప్రభుత్వాలకు విద్యార్థులపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థంచేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ విద్యపై నమ్మకం లేక తల్లిదండ్రులు విధిలేని పరిస్థితుల్లో కార్పొరేట్‌ సంస్థల్లో వారి పిల్లల్ని చేర్పించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ ఏడాడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడకపోవడంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు, కూలీలు వారి పిల్లలను ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివించేందుకు అవస్థలు పడుతున్నారన్నారు. ఫీజులు కట్టలేక, పిల్లల్ని చదువు మాన్పించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను చెల్లించకపో హాల్‌టికెట్‌ ఇవ్వం, పరీక్షలు రాయనీయం అంటూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న నిర్లక్ష్య విధానాల వల్లే వీరంతా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ఫీజులన్నింటినీ ప్రభుత్వమే భరించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కరువు జిల్లాల్లో విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్పు కింద రూ.10వేలు వెంటనే అందజేయాలన్నారు. జగనన్న వసతిదీవెన కోసం విద్యార్థుల వద్ద యాజమాన్యాలు జాయింట్‌ అకౌంట్లు ఓపెన్‌చేయించి ఆయా డబ్బులను విద్యార్థులతో వసూలు చేయకుండా, నేరుగా విద్యార్థుల అకౌంట్లలోనే జమ ఆయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఎస్‌ఎఫ్‌ఐ తరుపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు శివ, రమేష్‌, వంశీ, నాయకులు సిద్దు, గిరి, శివ, ధనుష్‌, అరవింద్‌, ఆదర్శ, నంద, బబాఖలందర్‌, అనిల్‌, పవన్‌ పాల్గొన్నారు.

➡️