బ్యాంకర్లు లక్ష్యాలను చేరుకోవాలి : కలెక్టర్‌

బ్యాంకర్లు లక్ష్యాలను చేరుకోవాలి : కలెక్టర్‌

సమావేశంలో బ్యాంకర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

అనంతపురం కలెక్టరేట్‌ : వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కేటాయించిన లక్ష్యాలను బ్యాంకర్లు ఖచ్చితంగా చేరుకోవాలని కలెక్టర్‌ ఎం.గౌతమి ఆదేశించారు. మంగళవారం నాడు అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జిల్లా సంప్రదింపుల కమిటీ (డిసిసి), జిల్లాస్థాయి సమీక్ష కమిటీ (డిఎల్‌ఆర్సీ) సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులకు విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయిట్‌మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం (పిఎంఈజిపి) కింద జిల్లాకు 246 యూనిట్లు మంజూరు చేయాలనే లక్ష్యం కేటాయించగా, 306 యూనిట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు 181 యూనిట్లకు మాత్రమే రుణాలు పంపిణీ చేశారన్నారు. స్టాండప్‌ ఇండియా పథకానికి సంబంధించి లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీవర్స్‌ ముద్రా పథకం కింద కూడా లక్ష్యాలను చేరుకోవాలని చెప్పారు. లబ్ధిదారుల పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిశీలించి వాటికి రుణాలు అందిందచేలా చూడాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను బ్యాంకులకు దరఖాస్తులు అందిన వెంటనే పరిశీలన చేసి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాలను 100 శాతం చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఎం ఎస్‌.అనిల్‌ కుమార్‌, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సత్యరాజ్‌, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, మెప్మా పీడీ విజయలక్ష్మి, బిసి కార్పొరేషన్‌ ఈడీ సుబ్రహ్మణ్యం, హార్టికల్చర్‌ డిడి రఘునాథరెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నాగరాజ్‌, నాబార్డు ఎల్డీఎం అనురాధ, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️