ముందుచూపులేకనే అనంతలో మంచినీటి సమస్య : సిపిఎం

 కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఖాళీ కుండలతో నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఎం నాయకులు, నగరవాసులు

            అనంతపురం కార్పొరేషన్‌ : గత పది రోజులుగా అనంతపురం నగరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, దీనిపై పాలకవర్గం, అధికారులకు ముందు చూపులేకనే ఈ సమస్య జఠిలం అయ్యిందని సిపిఎం నాయకులు తెలియజేశారు. నగరంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఒకటవ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలు, కడవలు పగులగొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఒకటవ నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ గత పది రోజుల నుంచి అనంతపురం నగరంలో మంచినీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. నీళ్లులేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరానికి నీటి సరఫరా చేసే కొర్రకోడు డ్యాం వద్ద నీటి పంపింగ్‌ మోటార్లు పాడైపోయి ఆరు నెలలు గడుస్తున్నా వాటిని మరమ్మతు చేయించకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారన్నారు. మోటార్ల మరమ్మతులను పట్టించుకోని డిఇ చంద్రశేఖర్‌, ఇతర అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంకా కొంతకాలం మంచినీటి సమస్య తప్పదంటూ అధికారులు, పాలకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దాహం వేసినప్పుడు బావి తవ్వే విధంగా అనంతపురం కార్పొరేషన్‌ అధికారుల తీరు ఉందన్నారు. గతంలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె చేస్తుంటే చెత్తను తొలగించడానికి పాలకులు, అధికారులు ప్రయివేటు ట్రాక్టర్లు, జెసిబిలను ఆఘమేఘాలపై తెప్పించారని, ఇప్పుడు నీటి సమస్య పరిష్కారానికి అవసరమైనన్ని ట్యాంకర్లను ఎందుకు తెప్పించ లేదని ప్రశ్నించారు. భవిష్యత్తులోనూ నగరానికి ఎలాంటి నీటి సమస్య లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కార్పొరేషన్‌ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ముష్కిన్‌, ప్రకాష్‌, వలీ, జీవ, ఎన్టీఆర్‌ శీన, రాజు, నూరుల్లా, ఫక్రూ, మోహన్‌, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

➡️