ముఖ్యమంత్రి స్పందించాలి

రాయదుర్గంలో అంగన్‌వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడుతున్న రాంభూపాల్‌

సిపిఎం జిల్లా కార్యదర్శి వి. రాంభూపాల్‌

రాయదుర్గం : న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మె బుధవారం 2వ రోజుకు చేరుకుంది. రాయదుర్గం జరుగుతున్న సమ్మెలో రాంభూపాల్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నారు. ఎన్నికల ముందు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. హామీలను తుంగలోకి తొక్కడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగన్‌వాడీలు రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. సమస్యల పరిష్కారం చేయాలంటూ సమ్మె చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం అధికారులతో బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. బెదిరింపులతో ఉద్యమాలను ఆపాలనుకోవడం అవివేకం అన్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు బెదిరింపు చర్యలను మానుకుని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. లేనిపక్షంలో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెను సిఐటియు, అనుబంధ రంగాల కార్మికులతో కలుపుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున, సిపిఎం నాయకులు మధు, అంజి, ఆంజనేయులు, నాగరాజు, రమేష్‌, శంకర్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు రాధమ్మ, ఉలిగమ్మ, రుద్రమ్మతో పాటు రాయదుర్గం మండల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

➡️