‘మెట్టు’ అసమర్థ నాయకుడు

'మెట్టు' అసమర్థ నాయకుడు

విలేకరులతో మాట్లాడుతున్న కాపు రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి-రాయదుర్గం

‘కార్యకర్తలను కాపాడే వాడే నాయకుడు.. వారికే కార్యకర్తలు మద్దతు ఇవ్వాలి’ అని తాజా మాజీ ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మెట్టు గోవిందరెడ్డి వైసిపి లో ఉంటూ ఎపిఐఐసి ఛైర్మన్‌గా పదవిని అనుభవించి తద్వారా లబ్ధి పొందారన్నారు. గత ఐదేళ్లలో వైసిపి కార్యకర్తలు గోపి, సత్యనారాయణ, మంజు, వెంకట్‌, బసవరాజు, తదిదరులు మృతి చెందగా వారి ఇంటి వైపు కన్నెత్తి చూడని వ్యక్తి మెట్టు అన్నారు. కరోనాకాలంలో అనేకమంది వైసిపి కార్యకర్తలు ఆరోగ్యం బాగా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అయితే మెట్టు ఎ ఒక్కరినీ పరామర్శించ లేద న్నారు. కార్యకర్తలు అలాంటి వారి వెంట వెళ్తే వారికి ఏమైనా అయితే ఎవరు చూస్తారని ప్రశ్నించారు. నాయకుడు అనే వారికి అర్హత ఉండాలని.. నమ్మిన వారిని కాపాడే శక్తిలేని వారిని కార్యకర్తలు కూడా పట్టించుకోవద్దని హితవు పలికారు. మెట్టు ఏనాడూ కార్యకర్తలను పరామర్శించలేదు, సాయం చేయలేదన్నారు. తాను పార్టీని వీడినప్పటికీ కార్యకర్తలకు ఓ అన్నగా, తమ్ముడిగా, కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. చేతనైన సాయం చేస్తానన్నారు. ఎవరైతే కార్యకర్తలను బాగా చూసుకుంటారో, సాయం చేస్తారో అలాంటి వారిని నమ్మాలని.. అసమర్థులను నమ్మవద్దని కాపు రామచంద్రారెడ్డి వైసిపి శ్రేణులకు సూచించారు.

➡️