విరాళాల కోసం ఇంటింటికీ సిపిఎం

పోస్టర్‌, సిక్టక్కర్లను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : సిపిఎం చేపట్టే ఉద్యమాలకు తోడ్పాటును అందించాలని కోరుతూ ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు నగరంలో ఇంటింటికీ తిరిగి విరాళాలు వసూలు చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌, స్టిక్కర్స్‌ను స్థానిక గణేనాయక్‌ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయమంటే వ్యాపారంగా మారిందన్నారు. నోట్లకట్టలతో ఓట్లు కొనడమే ప్రజాస్వామ్యంగా మారింది. ఎన్నికల బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయల నల్లడబ్బు అధికార పార్టీల ఖాతాల్లోకి వెళ్లాయన్నారు. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు రద్దు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందన్నారు. పాలక రాజకీయాలకు పూర్తిగా భిన్నమైనవి కమ్యూనిస్టు రాజకీయాలు అన్నారు. ప్రజా సమస్యలపై నిజాయితీగా పని చేయడం, ప్రజలిచ్చిన సొమ్ముతో ప్రజల కోసం పని చేయడం సిపిఎం విధానమన్నారు. జిల్లాలో రైతు, వ్యవసాయ కూలీల సమస్యలపై నిరంతరం సిపిఎం పనిచేస్తోందని చెప్పారు. ఇటీవల జరిగిన అంగన్వాడీ, మున్సిపల్‌ తదితర కార్మికుల సమ్మెలకు సిపిఎం అండగా నిలిచిందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం జరిగిన ఆందోళనల్లో సిపిఎం అగ్రభాగాన నిలబడి పోరాటం సాగించిదన్నారు. సాంస్కతిక, సాహిత్య సభలకు చేదోడుగా నిలిచిందన్నారు. కార్మికులు, కష్టజీవులు ఇచ్చిన సొమ్ముతో ప్రజలకు జవాబుదారీగా ఉన్న సిపిఎంను ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, వి.సావిత్రి, ఎం.బాలరంగయ్య, ఎస్‌.నాగేంద్ర, నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు పాల్గొన్నారు.

➡️