వైసిపి నేతల్లో గుబులు..!

Jan 5,2024 09:03

 

         అనంతపురం ప్రతినిధి : వైసిపి నేతల్లో గుబులు నెలకొంది. మొన్నటి వరకు ధీమాగానున్న నేతలు కూడా ఇప్పుడు టిక్కెట్టు వస్తుందా రాదా అన్న ఆందోళనలోనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి పెద్దఎత్తున మార్పులు తీసుకురాబోతోందన్న ప్రచారం నడుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే కొన్ని మార్పులు చేపట్టింది. మిగిలిన నియోజక వర్గాల్లోనూ మార్పులతో జాబితాలను విడుదల చేయనుంది. దీంతో సమన్వయకర్తలను కొత్తగా నియమించని నియోజకవర్గాల నేతలు విజయవాడలో వైసిపి ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఏదో రకంగా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

వైసిపి అధిష్టానం ఇటీవలే నియోజకవర్గాల సమన్వయకర్తల పేరుతో రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్‌ స్థానాలకు కొత్త సమన్వయకర్తలను నియమించింది. ఇదివరకే హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్తను కొత్తగా నియమించారు. ఈ రకంగా మొత్తం నాలుగు అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలకు కొత్త సమన్వయకర్తలు వచ్చేశారు. ఇక మిగిలింది పది అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇందులో ఎటువంటి మార్పులు ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

విజయవాడలో మకాం..

         టికెట్టుపై సందేహమున్న వైసిపి ముఖ్య నేతలు విజయవాడలోనే మకాం వేసి తిరిగి దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసుకునే పనిలోనున్నారు. టిక్కెట్టు లేదని తేలిపోయిన నేతలు కూడా మరో చోట అవకాశం ఏమైనా ఉందా అని వెతుక్కునే పనిలోపడ్డారు. హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్‌కు అవకాశం లేదని తేలింది. బళ్లారికి చెందిన శాంతను ఆయన స్థానంలో తీసుకని వచ్చారు. అయితే తనకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏదోక చోట అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వాలని ముఖ్య నేతలను మాధవ్‌ అడుగుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. దీనిపై బాహాటంగా ఆయన ఎక్కడా స్పందించలేదు. ఇక రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా విజయవాడలోనే మకాం వేశారు. ఆయన్ను రాయదుర్గం నుంచి తప్పించి కళ్యాణదుర్గంకు పంపుతారని గతంలో ప్రచారం జరిగింది. ఇటీవల రెండవ జాబితా ప్రకటించిన సందర్భంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్యను కళ్యాణదుర్గం సమన్వయకర్తగా ప్రకటించారు. దీనికి తోడు రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కాపు భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ముఖ్య నేతల చుట్టూ కాపు తిరుగుతున్నారు. ఇక ఎస్సీ రిజర్వు స్థానాలైన శింగనమల, మడకశిర రెండు చోట్లా మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఆ నేతలు కూడా ఏదో రకంగా మూడో జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేపడుతున్నారు. పుట్టపర్తి పరిస్థితి ఇంచుమించు ఇదే రకంగా ఉంది. కొత్తగా నియోజకవర్గ సమన్వయకర్తల నియామకం జరిగిన నాలుగు నియోజకవర్గాలు కాకుండా తక్కిన అన్ని చోట్ల ఎటువంటి మార్పులుండనున్నాయన్న గుబులు మాత్రం అక్కడి నేతలందరిలోనూ నెలకొంది. పైకి తమ స్థానం పదిలమని చెబుతున్నప్పటికీ లోలోనమాత్రం ఆందోళన నెలకొంది. అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని భయపడుతున్నారు.

➡️