సందిగ్ధంలో శింగనమల..!

        అనంతపురం ప్రతినిధి : శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులెవరన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. అటు అధికార వైసిపిలోనూ…ఇటు ప్రతిపక్ష టిడిపి రెండింటిలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన ఈ ప్రాంతంలో రెండు పార్టీల నుంచి ఈసారి మార్పులుంటాయని ప్రచారమూ నడుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా వైసిపి నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమెకు ఈసారి అవకాశం లేదని అధిష్టానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. జొన్నలగడ్డ పద్మావతి భర్త అలూరు సాంబశివారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా చెప్పుకుంటూ ఉంటారు. సర్వేల్లో తగినంత సానుకూలత లేనందున మార్పు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. గత వారంలో ఎమ్మెల్యే దంపతులు అక్కడే ఉండి టికెట్టు కోసం వారి ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే జొన్నలగడ్డ పద్మావతి సోషియల్‌ మీడియాలో సాగునీటి సమస్యపై మాట్లాడటం, అందులో వైసిపి ప్రజాప్రతినిధుల గురించి ప్రస్తావించడం పెద్ద దుమారమే రేపింది. విజయవాడలో ఈ అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వివరణిచ్చుకునే పరిస్థితి నెలకొంది. అనంతరం జొన్నలగడ్డ పద్మావతి దంపతులు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలసిన ఫోటోలు మీడియాకు అందజేశారు. పార్టీ కోసం పనిచేస్తామన్న ప్రకటన కూడా చేశారు. ఈ క్రమంలో కొత్త అభ్యర్థిని సూచించే బాధ్యత కూడా వీరిపైనే ఉంచినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో వైసిపి సర్వే బృందాలు ఎవరైతే బాగుంటుందని ఆరా తీసే పనిలో ఉన్నాయి. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు పెద్దఎత్తున ప్రచారం నడుస్తున్నప్పటికీ ఎంపికపై కసరత్తు పూర్తవలేదు. మూడో జాబితా విడుదల సమయానికి అయినా ఈ నియోజకవర్గంపై వైసిపిలో స్పష్టత వస్తుందా లేక మరో జాబితా వరకు వేచి చూడాల్సి ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీలోనూ అయోమయమే.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోనూ అయోమయమే కొనసాగుతోంది. 2019లో ఇక్కడ టిడిపి ఓటమి చెందింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన బండారు శ్రావణినే కొంతకాలం నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా నియమించారు. ఇక్కడి నేతలకు, ఈమెకు మధ్య పొగసకపోవడంతో విభేదాలు తారా స్థాయిలో చెలరేగాయి. దీంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జీని కాదని టుమెన్‌ కమిటీ పేరుతో ఇద్దరు నాయకులను తెరపైకి తెచ్చారు. వారి ఆధ్వర్యంలో అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ఇద్దరు నాయకులు కూడా ఓసి సామాజిక తరగతికి చెందిన వారు కావడం గమనార్హం. ఎస్సీ రిజర్వు నియోజకవర్గం కావడంతో ఎస్సీ సామాజిక తరగతి నుంచి ఇన్‌ఛార్జీని నియమించాల్సి ఉంది. ఇప్పటికీ దీనిపై టిడిపిలో స్పష్టత రాలేదు. గతంలో పోటీ చేసి ఓటమి చెందిన బండారు శ్రావణినే మళ్లీ నియమిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోవైపు మాజీ ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్‌ టిడిపిలో చేరుతారన్న ప్రచరామూ ఉంది. చేరితే ఆయనకే టిక్కెట్టు ఇస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.

➡️