సమస్యలు పరిష్కరించకుండా.. అసత్య ప్రచారాలా..!

స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో అధికారులను నిలదీస్తున్న కార్పొరేటర్లు

         అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి కార్పొరేటర్‌ గురుశేఖర్‌ బాబు ఈ నెల 4వ తేదీన స్పందనలో ఓ అర్జీని అందజేశారు. సదురు కార్పొరేటర్‌ అర్జీలు ఇచ్చిన సమస్య పరిష్కారం చేయకుండానే సమస్య పరిష్కరించినట్లు మొబైల్‌కు సంక్షప్తి సందేశం వచ్చింది. దీంతో సదరు కార్పొరేటర్‌ అవాక్కయ్యారు. ఇదే అంశాన్ని శుక్రవారం నాడు జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో కమిషనర్‌ మెఘస్వరూప్‌ దృష్టికి తీసుకెళ్లారు. చేతనైతే సమస్యను పరిష్కరించాలి గానీ, అలాకాకుండా పరిష్కరించినట్లు తప్పుగా మెసేజ్‌లు ఎలా పంపుతారు అంటూ డిప్యూటీ సిటీ ప్లానర్‌ మారుతి ప్రసాద్‌ను నిలదీశారు. ఈ విషయంపై కలుగుజేసుకున్న కమిషనర్‌ కార్పొరేటర్‌ తెలిపిన సమస్యలను పరిశీలించి దానిని పరిష్కరించాలని డిసిపి మారుతీప్రసాద్‌ను ఆదేశించారు. రూ.14457.61 లక్షల ముసాయిదా బడ్జెట్‌అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముసాయిదా బడ్జెట్‌ ప్రతిపాదనను స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది. బడ్జెట్‌ను రూ.14457.61 లక్షలుగా నిర్ధారించారు. ఎన్నికల కోడ్‌ రానుండటంతో హడావుడిగా ప్రజా సమస్యలు ఏవీ చర్చించకుండానే స్టాండింగ్‌ కమిటీలో ముసాయిదా బడ్జెట్‌ను ఆమోదించి గవర్నమెంట్‌ ఏజెన్సీలు గతంలో నిర్వహించిన శిక్షణ తరగతుల బిల్లుల చెల్లింపునకు మాత్రమే స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఉపయోగపడింది. నగరంలో కొత్త ఊరులోని ఈఎల్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులకు వాటర్గేజ్‌ మిషన్లను అమర్చాలని సభ్యులు కోరారు. పారిశుధ్య పనులు మెరుగుపరచడానికి పుష్కర్లు కొత్తవి కొనుగోలు చేయాలని, మినీ జెసిబి మిషన్లను వినియోగంలోకి తేవాలని కోరారు. స్లీపింగ్‌ మిషిన్లు మరమ్మతులు లేక మూలన పడ్డాయని వాటిని వినియోగంలోకి తేవాలన్నారు. కంపోస్ట్‌ యార్డు నిరంతరం తగలబడుతూ ఉందని దానికి సంబంధించి చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ గతంలో అక్కడ బోరు వేసి పైపులు అమర్చి రింగులర్లు ఏర్పాటు చేశామన్నారు. కంపోస్ట్‌ యార్డు తగలబడుతుండడంపై సమావేశంలో పూర్తి స్థాయి పరిష్కారంపై పాలకవర్గం, అధికారులు చర్చించకుండా మౌనముద్ర వహించడం కోసమెరుపు. స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు ముంతాజ్‌ మాట్లాడుతూ నెలకోసారైనా ప్రధాన కాలువల్లో పూడిక తీయించాలని, లేకుంటే 2022 నవంబర్‌లో వచ్చిన వరదలు మరోసారి వస్తే ప్రాణ, ఆస్తి నష్టం వాటిలే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

➡️