సామాజిక సాధికారత ఇదేనా.?

సామాజిక సాధికారత ఇదేనా.?

       అనంతపురం ప్రతినిధి : బీసీలంటే బ్యాక్‌వర్డు కాదు… బ్యాక్‌బోన్‌ అంటూ వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా నేతలు వైసిపి అధికారంలోకి వచ్చాక బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ప్రకటిస్తున్నారు. జనాభాలో 50 శాతమున్న బిసిలకు పదవుల్లోనూ 50 శాతం స్థానాలు కేటాయిస్తున్నామని చెబుతున్నారు. ఈ పదవులన్నీ ఇప్పటి వరకు చూస్తే స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల కేటాయింపుల వరకే ఉన్నాయన్న విమర్శలున్నాయి. విధానపరమైన నిర్ణయాలు జరిగే శాసనసభకు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలకు టిక్కెట్లు కేటాయించే విషయంలో లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

66 శాతం ఒసిలకే ..

        ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో రెండు రిజర్వు స్థానాలుపోనూ 12 జనరల్‌ స్థానాలున్నాయి. ఇందులో చూసినప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎనిమిది అసెంబ్లీ సీట్లకు ఓసి అది కూడా రెడ్డి సామాజిక తరగతికి చెందిన వారికే టిక్కెట్టును వైసిపి కేటాయించింది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, పెనుకొండ, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు స్థానాలు బీసీలకు, ఒక స్థానం మైనార్టీకీ కేటాయించారు. తక్కిన ఎనిమిది నియోజకవర్గాల్లో ఓసిలకే టిక్కెట్లు ఇచ్చారు. అందులోనూ కళ్యాణదుర్గం మంత్రి ఉషచరణ్‌శ్రీ ఉన్నారు. ఆమె భర్త చరణ్‌రెడ్డి ఓసి సామాజిక వర్గానికి చెందన వారనే విమర్శ ఉంది. ఇక రిజర్వు నియోజకవర్గాల్లో ఇదే రకమైన విమర్శ కనిపిస్తోంది. శింగనమల ఎస్సీ రిజర్వు స్థానం నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డే రాజకీయ వ్యవహరాలు నియోజకవర్గంలో చూస్తారు. పేరుకు పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వ్యవహరాలు అన్నీ చూస్తుండటంతో ఇందులో సామాజిక న్యాయం ఏ రకంగా అవుతుందన్న ప్రశ్నలు సర్వత్రా లేవనెత్తుతున్నారు. తాజాగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగాఉన్న ఇక్బాల్‌ను తొలగించాక దీపికారెడ్డిని పెట్టారు. ఆమె బిసి అయినప్పటికీ భర్త వేణుగోపాల్‌రెడ్డి ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. రాజకీయాల్లో కీలకమైన అసెంబ్లీ స్థానాలకు టిక్కెట్లు కేటాయించే విషయంలో సామాజిక సాధికారత ఎక్కడుందన్న ప్రశ్నను సామాజికవేత్తలు లేవనెత్తుతున్నారు.

టిడిపిలోనూ 50 శాతానికిపైగా ఓసిలే

       2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకీ ఓసిలకే అధిక ప్రాధాన్యతనిచ్చిందన్న విమర్శ ఉంది. వైసిపి రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తే టిడిపి కమ్మ సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. 14 అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాల్లో వారికే టిక్కెట్లు కేటాయించింది. అనంతపురం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, ధర్మవరం, హిందూపురం అసెంబ్లీ స్థానాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారుండగా, పుట్టపర్తి, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారున్నారు. 14 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో ఓసిలకు చోటు కల్పించారు. కదిరి, గుంతకల్లు, రాయదుర్గం, పెనుకొండ మాత్రమే బిసిలకు కేటాయించారు. తక్కిన రెండు స్థానాలు రిజర్వు నియోజకవర్గాలున్నాయి. ఈ రకంగా చూస్తే రెండు ప్రధాన పార్టీలు కూడా బిసి, ఎస్సి,మైనార్టీలకు కేటాయిచిన సీట్ల ప్రాధాన్యత ఏ పాటితో అర్థమవుతుంది. మాటల్లో సామాజిక సాధారికాత, ప్రధానమైన పదవుల వరకు వచ్చే సరికి ఓసీల వైపే రెండు ప్రధాన పార్టీలు మొగ్గు చూపుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

➡️