చంద్రబాబు రాజకీయ వికలాంగుడు

Mar 9,2024 15:12 #Anantapuram District

పొత్తులకై వెంపర్లాట 

అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
ప్రజాశక్తి-రాయదుర్గం : టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడు రాజకీయ వికలాంగుడని వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఊదుబత్తుల(అగర ఒత్తుల) వలె బిజెపి, జనసేనతో పొత్తులకై వెంపర్లాట ఆడుతున్నాడని అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం రాయదుర్గంలోని వైకాపా అసెంబ్లీ అభ్యర్థి రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి నివాసం వద్ద జరిగిన నియోజకవర్గస్థాయి వైకాపా కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన పాలనలో గుర్తించే ఏ ఒక్క పని చేయలేదన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే అనేక సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. చంద్రబాబు చెప్పే సూపర్ సిక్స్ అమలు చేయాలంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరం అన్నారు. చంద్రబాబు గత ఎన్నికలలో 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టోను ప్రకటించి అనంతరం దాన్ని అదృశ్యం చేశారన్నారు. వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినవి కూడా చేయడమే కాక చెప్పనివి కూడా చేసి ప్రజలకు సుపరిపాలన సాధ్యం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకు గల సామీప్యం సారూప్యం నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రాయదుర్గం అసెంబ్లీ అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ రెండోసారి జగన్ సీఎంగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో గార్మెంట్ పరిశ్రమలో పనిచేయు కార్మికులకు రాయితీపై విద్యుత్ సరఫరా చేయాలని, రైతులకు లాభదాయకంగా ఉన్న వెదురు పంట సాగుకు చేయూతనివ్వాలన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వల్ల నియోజకవర్గంలో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం వల్ల ప్రజలు మరోసారి ఆయనకు సీఎం గా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కార్యకర్తలు 45 రోజులపాటు కష్టపడి ఎమ్మెల్యేగా గోవిందరెడ్డిని, ఎంపీగా శంకర్ నారాయణ ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. వైకాపా పార్లమెంట్ అభ్యర్థి శంకర నారాయణ మాట్లాడుతూ వైకాపా కార్యకర్తలకు ఎన్నికలలో దశ దిశ నిర్దేశనం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పామిడి వీరాంజనేయులు, ఎం ఆర్ సి రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షులు బోయ గిరిజమ్మ ఎమ్మెల్సీ మంగమ్మ, ఏ డి సి సి బ్యాంక్ అధ్యక్షులు లిఖిత, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు భోజరాజు నాయక్, మాజీ అధ్యక్షులు ఉషారాణి, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి, జెడ్పిటిసి సభ్యులు హసీనా బేగం, మల్లికార్జున, పద్మావతి, పార్టీ మండల కన్వీనర్లు వన్నూరు స్వామి, లక్ష్మీకాంతరెడ్డి, రాయదుర్గం పురపాలక సంఘం అధ్యక్షులు పోరాలు శిల్ప, ఉపాధ్యక్షులు వలి భాష, శ్రీనివాస్ యాదవ్, ఇంకా అనేకమంది వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️