కౌంటింగ్‌కు పకడ్బందీ చర్యలు

జెఎన్‌టియులో కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

         అనంతపురం కలెక్టరేట్‌ : ఎన్నికల కమిషన్‌ మార్గనిర్దేశకాల ప్రకారం సాధారణ ఎన్నికల కౌంటింగ్‌ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌, ఎస్పీ గౌతమిశాలి తెలియజేశారు. అనంతపురం నగరంలోని జెఎన్‌టియులో సాధారణ ఎన్నికల దష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ కోసం ఏర్పాట్లు అన్ని ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లేందుకు బ్యారీకేడింగ్‌ చేపట్టాలన్నారు. జెఎన్‌టియు అవసరమైనచోట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. వాటి ఫీడింగ్‌ అంతా పోలీసు కంట్రోల్‌ రూమ్‌లో వచ్చేలా చూడాలన్నారు. కౌంటింగ్‌ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లు అన్నీ వెంటనే మొదలుపెట్టి పక్కగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో టేబుల్స్‌, కుర్చీల ఏర్పాటు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, కౌంటింగ్‌ అసిస్టెంట్‌, మైక్రో అబ్జర్వర్లకు సీటింగ్‌ ఏర్పాటు, ఏజెంట్లకు కూర్చునేందుకు ఏర్పాట్లు, టవర్‌ ఏసీల ఏర్పాట్లు సకాలంలో చేయాలన్నారు. గుర్తింపు కార్డు లేకుండా కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎవరికీ అనుమతి లేదన్నారు. ఎస్పీ గౌతమి శాలి మాట్లాడుతూ సాధారణ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత ఉంటుందన్నారు. జేఎన్టీయూ ప్రధాన ద్వారం వద్ద బందోబస్తు పటిష్టంగా కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. కౌంటింగ్‌ పూర్తయ్యేంత వరకూ నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌, అడిషినల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, నోడల్‌ అధికారులు అప్పాజీ, ఓబుల్‌ రెడ్డి, గురుస్వామిశెట్టి, డీఎస్పీ మునిరాజు, సిఐలు రెడ్డప్ప, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️