కాంగ్రెస్‌తోనే బడుగుల అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే బడుగుల అభివృద్ధి

మహిళలతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వై మధుసూదన్‌రెడ్డి

ప్రజాశక్తి-వజ్రకరూరు

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే నే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమ వుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. సోమవారం కూడేరు మండల పరిధిలోని నారాయణపురం, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను ఆదరిస్తే రైతులు, నిరుద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బిజెపి ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పదేళ్లుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీ చట్టాలను అమలు చేయకుండా రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిందన్నారు. బిజెపితో జతకట్టిన వైసిపి, టిడిపిలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలన్నా.. రాష్ట్రాల్లో అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. కావున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామానికి చెందిన పలువురు నిఖిల్‌నాథ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎస్సీ, ఎస్టీ, జెఎసి రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు, రామకృష్ణ, ఓబుళపతి, బుగ్గయ్య, రామ్మూర్తి, వార్డు సభ్యులు మహాలక్ష్మి, విజరు, రామయ్య, వంశీ, శివ, పెన్నయ్య, ఆనంద్‌, తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

➡️