హామిలిచ్చి మోసం చేయడం చంద్రబాబు నైజం

హామిలిచ్చి మోసం చేయడం చంద్రబాబు నైజం

మాట్లాడుతున్న వై.విశ్వేశ్వరరెడ్డి

ప్రజాశక్తి-వజ్రకరూరు

ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ప్రజలను మోసం చేయడం టిడిపి అధినేత చంద్రబాబు నైజమని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఆదివారం ఉరవకొండ మండల పరిధిలోని వెలుగొండ గ్రామంతోపాటు విడపనకల్లు మండల పరిధిలోని గాజుల మల్లాపురం, ఉండబండ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసం ఎన్ని హామీలైన ఇచ్చి ప్రజలను మోసం చేసే నైజం చంద్రబాబుది అన్నారు. ఎందుకంటే 2014 లో అధికారం కోసం 600 లకు పైగా హామీలు గుప్పించి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడన్నారు. దీన్ని ప్రజలు గుర్తుకు చేసుకోవాలన్నారు. జగన్‌ అలా కాదని.. 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చారన్నారు. ఇప్పుడు జగన్‌ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో పేదలకు మరింత అండగా నిలుస్తోందని వెల్లడించారు. నూటికి నూరు శాతం హామీలన్నీ నెరవేర్చుతాడని ధీమా వ్యక్తం చేశారు. మరోమారు సీఎంగా జగన్‌ బాద్యతలు చేపట్టిన తరువాత మరింత పటిష్టంగా పథకాలు అమలు చేస్తారని వివరించారు. జగన్‌ పాలన లో రైతులకు రైతు భరోసా, ఇన్సూరెన్స్‌, ఇన్పుట్‌ సబ్సిడీ అందించి ఆదుకున్నాడని తెలిపారు. 2023 ఖరీఫ్‌ కు సంబంధించి పంట నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రకటించారని, త్వరలోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతాయన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనించి ఏ ప్రభుత్వం మంచి చేసిందో గుర్తించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️