ప్రజలు ఆలోచించి ఓటేయాలి : విశ్వ

ప్రజలు ఆలోచించి ఓటేయాలి : విశ్వ

ప్రచారంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి

ప్రజాశక్తి-వజ్రకరూరుః

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవి.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలిః అని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉరవకొండ మండలం రాకెట్ల, రాకెట్ల తండా గ్రామాల్లో జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, విశ్వేశ్వరరెడ్డి సోదరుడు వై.శ్రీనాథ్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత గ్రామంలోని సుంకులమ్మ అవ్వ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచార రథంపై రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గజమాలతో సత్కరించారు. అనంతరం గ్రామ కూడళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకు రాదన్నారు. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఆయనలా మోసపూరిత హామీలు జగన్‌ ఇవ్వలేదన్నారు. సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. ముఖ్యంగా రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేశాడని విమర్శించారు. అందుకే మాట మీద నిలబడే జగన్‌ కావాలో, మోసం, దగా చేసే చంద్రబాబు కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కాగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఎమ్మెల్యే పదవికి అనర్హుడన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉండి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. కనీసం ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా కేవలం హైదరాబాద్‌, విజయవాడకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజలకు అందుబాటులో లేని ఇలాంటి వ్యక్తికి ఈసారి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హంద్రీనీవాపై రాకెట్ల లిఫ్ట్‌ క్లియరెన్స్‌ పనులు వేగవంతమయ్యాయని, భూమి కోల్పోయిన రైతులకు పరిహారం కూడా మంజూరైందన్నారు. మనందరి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు లిఫ్ట్‌ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధి కొనసాగలంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శంకరనారాయణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉరవకొండలోని 10వ వార్డు, హరిజనవీధి మూగ బసవన్న కట్ట, నవతా ట్రాన్స్‌పోర్ట్‌, కందారమ్మ, పెద్దమ్మ ఆలయాల ప్రాంతాల్లో యువనేత వై.ప్రణరురెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

➡️