అధికారంలోకి వస్తే రూ.2లక్షల రైతు రుణమాఫీ

అధికారంలోకి వస్తే రూ.2లక్షల రైతు రుణమాఫీ

కాంగ్రెస్‌లోకి చేరిన వారికి కండువాలు కప్పుతున్న మధుసూదన్‌రెడ్డి

ప్రజాశక్తి-వజ్రకరూరు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి వస్తే రైతులకు రూ.2లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. శనివారం వజ్రకరూరు మండల పరిధిలోని గంజికుంట, తట్రకల్‌ గ్రామాల్లో సిపిఎం నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీతోపాటు ప్రత్యేక హోదా వస్తుందన్నారు. గత పదేళ్లలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కేవలం వారి స్వార్థ రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు బిజెపితో కుమ్మక్కై ప్రజల సంక్షేమం కోసం పాటుపడడం లేదన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చిన టిడిపి, వైసిపి నాయకులు మాట నిలబెట్టుకోలేక పోయారన్నారు. ఆయా పార్టీలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా తట్రకల్లు గ్రామంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి మధుసూదన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో సోమశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జయేందర్‌రెడ్డి, మల్లికార్జున, వసంతమ్మ, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్‌ విరుపాక్షి, డిసిసి ఉపాధ్యక్షులు వడ్ల ఆంజనేయులు, కాంగ్రెస్‌ మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌వర్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️