సజావుగా పోస్టల్‌ బ్యాలెట్‌

అనంతపురం రూరల్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటీ సెంటర్‌ను పరిశీలించి అధికారులో మాట్లాడుతున్న కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్‌ కుమార్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అని చర్యలూ తీసుకుంటున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను ఈనెల 3వతేదీ నుంచి మొదలు పెట్టామన్నారు. మొదటి రెండు రోజులూ కొన్ని ఇబ్బందులు ఎదురైనా సోమవారం నుంచి ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వారు 26,150 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని, 10,499 మంది ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. 40.15 శాతం ఇప్పటివరకు నమోదయిందన్నారు. అనంతపురం అర్బన్‌లో 2,773, రాప్తాడులో 1,377, రాయదుర్గంలో 579, ఉరవకొండలో 909, గుంతకల్లులో 1366, తాడిపత్రిలో 1200, శింగనమలలో 680, కళ్యాణదుర్గంలో 948 ఓట్లు పోలయ్యాయన్నారు. ఇతర జిల్లాలకు సంబంధించి 667 మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఫామ్‌-12 ఇచ్చిన వారందరికీ సద్వినియోగం చేసుకునేలా ఫెసిలిటేషన్‌ చేస్తామన్నారు. ఇక హోమ్‌ ఓటింగ్‌ కు సంబంధించి 1,247 మంది దరఖాస్తు చేసుకోగా, ఆదివారం నాటికి 296 మంది ఓటును సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న విలేకరులందరూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకుని రావాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, డీపీవో ప్రభాకర్‌ రావు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలి టేషన్‌ సెంటర్‌ పరిశీలన

        అనంతపురం నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎం కమిషనింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ లో ఏర్పాటుచేసిన హెల్ప్‌ డెస్క్‌ ద్వారా అందరికీ అవసరమైన వివరాలు తెలియజేయాలన్నారు. అనంతరం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎం కమిషనింగ్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ ను పరిశీలించారు. నగరంలోని ఎస్‌ఎస్‌బిఎన్‌ కళాశాలలో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. ఆర్ట్స్‌ కళాశాలలో శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఈవీఎం కమిషనింగ్‌ ప్రక్రియను, స్ట్రాంగ్‌ రూమ్‌లను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారి జి.వెంకటేష్‌, తహశీల్దార్‌లు శివరామిరెడ్డి, హనుమాన్‌ నాయక్‌ పాల్గొన్నారు.

➡️