విద్యుత్‌ సమస్యలను పరిష్కరించండి : సిపిఎం

విద్యుత్‌ సమస్యలపై అధికారులతో చర్చిస్తున్న సిపిఎం నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం నగరంలో డి3 పరిధిలోని 1,2,3,4,5 రోడ్లు, ఆర్‌కె నగర్‌, ఇందిరానగర్‌ తదితర కాలనీల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని సిపిఎం నాయకులు విద్యుత్‌ అధికారులను కోరారు. ఈ మేరకు అనంతపురం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రమేష్‌ను గురువారం ఆయన కార్యాలయంలో కలిసి సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా సిపిఎం ఒకటవ నగర కార్యదర్శి వి.రామిరెడ్డి మాట్లాడుతూ డి3 పరిధిలో పనిచేస్తున్న ఎఈ, లైన్‌మెన్‌, ఇతర సిబ్బంది విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆప్రాంతాల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. ఏఈ, విద్యుత్‌ శాఖ కార్యాలయానికి ఫోన్‌ చేసినా స్పందన లేదన్నారు. మూడు రోజుల క్రితం అనంతపురంలో గాలి, చిన్నపాటి వర్షంతో చెట్లు కూలిపోయాయన్నారు. ఇది జరిగి మూడు రోజులు అవుతున్నా ఆ ప్రాంతాల్లో విద్యుత్‌ సమస్య పరిష్కారం కాలేదన్నారు. సమస్యను పరిష్కరించాలని గత 15 రోజుల క్రితం ఎస్‌ఇకి వినతిపత్రం కూడా అందించామన్నారు. విద్యుత్‌, కార్పొరేషన్‌ అధికారుల మధ్య సమన్వయం కొరవడిందన్నారు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను గుర్తించి విద్యుత్‌ సమస్య లేకుండా చూడాలని కోరారు. ఈ సమస్యలపై ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ మాట్లాడుతూ విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు వలీ, మసూద్‌, ప్రసాద్‌, ఎన్టీఆర్‌ శీన, రాజు, గఫూర్‌, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.

➡️