కౌంటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహిస్తాం : ఎస్పీ

ఎస్పీ గౌతమి శాలి

        అనంతపురం క్రైం : అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ను ఎలాంటి శాంతిభద్రతల సమస్య రానీయకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి తెలియజేశారు. ఎస్పీగా ఆమె ఆదివారం ఆమె జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ కాన్ఫరెన్స్‌ హాలులో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రశాంతత లోపించకుండా శాంతిభద్రతలను పరిరక్షించడానికి కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తామన్నారు. అన్నివర్గాల ప్రజల సహకారం తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో మాట్లాడి మెరుగైన పోలీసింగ్‌కు కషి చేస్తామన్నారు. సెన్సిటివ్‌ గ్రామాలు, బైండోవర్లు… ఇలా ఏదైనా చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు స్ట్రాంగ్‌ రూంల వద్ద పటిష్టంగా మూడంచెల భద్రత కొనసాగుతోందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ సందర్భంగా ఎలాంటి హింస, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మూడంచెల భద్రతను మరింత బలోపేతం చేయండిపోల్డ్‌ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంలను ఎస్పీ గౌతమిశాలి పరిశీలించారు. కేరళ సాయుధ స్పెషల్‌ పోలీసులు, ఏఆర్‌ సాయుధ పోలీసులు, సివిల్‌ పోలీసులు మూడంచెల భద్రత నిర్వహిస్తుండటాన్ని సమీక్షించి మరింత బలోపేతం చేయాలన్నారు. పార్కింగ్‌ స్థలాన్ని స్ట్రాంగ్‌ రూంలకు దూరంగా ఏర్పాటు చేయాలన్నారు. అన్ని గేట్లలోను సిబ్బందిని బందోబస్తుకు నియమించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు, హింసకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు ఆర్‌.విజయభాస్కర్‌ రెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి (ఏఆర్‌), అనంతపురం డీఎస్పీ టివివి.ప్రతాప్‌, ఎఆర్‌ డీఎస్పీ మునిరాజ, సిఐలు జాకీర్‌ హుస్సేన్‌, ఇందిర, రెడ్డెప్ప, ప్రతాప్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

➡️