ఆ కుటుంబానికి ‘గుండె’కోత

ఆ కుటుంబానికి 'గుండె'కోత

చెక్కులు అందజేస్తున్న అమ్మ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రమణారెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఓ కుటుంబంలో ఏకంగా ఐదుగురు చిన్నారులకు గుండె సమస్య తలెత్తింది. జన్నుపరమైన సమస్యల కారణంగా కుటుంబంలో ఐదుగురికి గుండె సంబంధిత వ్యాధి సంక్రమించింది. శస్త్ర చికిత్స ఒకటే మార్గంగా ఉన్నా, కనీసం మందులు కొనలేని పరిస్థితిలో కుటుంబం ఉంది. ఈ విషయం తెలుసుకున్న అమ్మ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తరిమెల రమణారెడ్డి తానున్నానంటూ చిన్నారుల గుండెకు రక్షణగా నిలిచారు. అవసరమైన వైద్యం ఖర్చులు అందించడంతోపాటు పూట గడవని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని హమాలీ కాలనీలో నివసిస్తున్న నరసింహులు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇతనికి భార్యతోపాట ఆరుగురు సంతానం ఉన్నారు. వీరిలో ఐదుగురు చిన్నారులు గుండె సమస్యతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయగా చిన్నారుల గుండెల్లో రంద్రాలు ఉన్నాయని చెప్పారు. జన్యుపరమైన గుండె సంబంధిత వ్యాధి అని, ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. ఇందుకు ఒక్కొక్కరికి సుమారు రూ.1.5లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. మొత్తం ఐదుగురు చిన్నారులకు సుమార రూ.7.50లక్షలు అవసమవుతుంది.ఓవైపు ఆర్థిక పరిస్థితి.. మరోవైపు కుటుంబ పోషణ భారమైన నేపథ్యంలో పిల్లలకు మెరుగైన వైద్యం అందించలేని దుస్థితి. ఈ సమయంలో తమకు తెలిసిన వారు చెప్పిన సమాచారం మేరకు నగరంలో ఉన్న అమ్మ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు తరిమెల రమణారెడ్డిని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన రమణారెడ్డి పిల్లల వైద్యం నిమిత్తం ఆపరేషన్‌కు కావాల్సిన రూ.7.50లక్షల చెక్కును అందజేశారు. అంతేగాకుండా తర్వాత ఖర్చులు, రవాణా సౌకర్యం మరో రూ.50వేలు అందించారు. భవిష్యత్తులో పిల్లలకు అవరమైన మందులు, విద్యకు సాయం అందచేస్తానని భరోసా ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి తమ పిల్లల ప్రాణాలు కాపాడిన అమ్మ సంస్థ అధ్యక్షులు తరిమెల రమణారెడ్డికి నరసింహులు కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

➡️