గణపవరంలో అంగన్వాడీల రాస్తారోకో

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు గురువారం గణపవరం సెంటర్లో సిఐటియు నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అంగనవాడీ మండల కమిటీ నాయకురాలు బి.రామకోటి అధ్యక్షత వహించారు. సభలో పాల్గొన్న సిఐటియు మండల అధ్యక్షులు ఎం.పెంటారావ్‌, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి చెన్నం చిన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత పది రోజులుగా సమస్యలు పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నిరంతరం పిల్లల సంరక్షణలో ఉంటున్న అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు అంగన్వాడీ కార్యకర్తలను తక్కువ చేసి మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ విజయ ప్రతాపరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమ్మె చేస్తున్న అంగనవాడి శిబిరాలపై అధికార పార్టీ విద్యార్థి సంఘం నాయకులతో దాడులు చేయించడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి మండల నాయకులు కళ్యాణి, జయలక్ష్మి, సీతామహాలక్ష్మి, రాజేశ్వరి, లక్ష్మీచ రాధ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️