ఒంటి కాలిపై అంగన్వాడీల నిరసన

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : అంగన్వాడీల చేపట్టిన నిరసన శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు ఒంటి కాలిపై నిలబడి గోవింద నామాలు చెబుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్‌ జగన్మోహన్‌ రెడ్డికి జ్ఞానోదయం కలిగి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చే విధంగా ఆయన మనసు మార్చాలని కోరుతూ గోవింద నామాలు ఉచ్చరించారు. ఈ నిరసనలో రాజంపేట టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌ రాజు పాల్గొని సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలతో కలిసి వారికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌, టిడిపి రూరల్‌ అధ్యక్షులు గన్నేసుబ్బ నరసయ్య నాయుడు, మాజీ మండలాధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ దాసరి రాజు వాణి, అంగన్వాడి కార్యకర్తలు రమాదేవి, సుజాత, ఈశ్వరమ్మ, శివరంజని, విజయ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.

➡️