మెడకు ఉరి తాళ్లతో అంగనవాడీల నిరసన

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : ఆంధ్రప్రదేశ్‌ అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం 22వ రోజు సమ్మెలో భాగంగా మెడలకు ఉరితాడులు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాడేపల్లిగూడెం అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు దీన స్వరూపరాణి, సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణలు మాట్లాడుతూ.. జగనన్న వస్తే మా జీవితాలు బాగుపడతాయని అనుకున్నాము కానీ ఇలా ఉరితాడులకు బలి అవుతాము అనుకోలేదన్నారు. మా అంగనవాడీల సమస్యలు పరిష్కరిస్తారా లేదా ఉరేసుకోమంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 22 రోజులు నుంచి అంగనవాడీలు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నకు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. కేంద్రంతో ముడిపడిన కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, అందరికీ పెన్షన్‌ ఇవ్వాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఐసిడిఎస్‌ను బలోపేతం చేయాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. గత నాలుగు సంవత్సరాలు కాలం నుండి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అనేక ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమానికి యడవల్లి వెంకట దుర్గారావు, ప్రబారాణి,కనక మహాలక్ష్మీ, వరలక్ష్మీ,ప్రసన్న, గాయత్రీ, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️