మా గ్రామానికి భద్రత కల్పించండి

కలెక్టర్‌కు విన్నవించుకున్న అద్దవారిపల్లె గ్రామస్తులు
ప్రజాశక్తి – రాయచోటి
వరదప్పగారి వరదారెడ్డి, ఆయన కుమారుడు వెంకటేశ్వర రెడ్డి భారి నుండి తమ గ్రామానికి భద్రత కల్పించాలంటూ అన్నమయ్య జిల్లా పరిధిలోని కలికిరి మండలం, గుండ్లూరు గ్రామపంచాయతీలోని అద్దవారిపల్లె గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన పార్వతమ్మ, ఈశ్వరమ్మ, సుశీలమ్మ, అమర్నాథరెడ్డి తదితరులు తమ గ్రామంలో వరదారెడ్డి, ఆయన కుమారుడు వెంకటేశ్వర్‌రెడ్డిలు చేస్తున్న భూకబ్జాలు, అక్రమాలు, గ్రామస్తులపై చేస్తున్న దౌర్జన్యాల గురించి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ ఆడవారిపల్లి గ్రామానికి చెందిన వరదా రెడ్డి, ఆయన కుమారుడు వెంకటేశ్వర్‌రెడ్డి గ్రామంలో అందరి మధ్య తగాదాలు సష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఎటువంటి అభివద్ధి కార్యక్రమాలు జరగనివ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. ప్రశ్నించిన వారిపై తన అనుచరులుగా ఉన్న ఎస్టీ, ఎస్టీలకు మద్యం తాగించి తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వారిరువురూ ప్రభుత్వ స్థలాల ఆక్రమించడమే కాకుండా భూములను సైతం ఆక్రమించి తప్పుడు రికార్డులు సష్టించుకుని, విక్రయించి సొమ్ము చేసుకోవడమే కాకుండా కొన్ని ప్రాంతాలలో భవనాల నిర్మించి బాడుగలకు ఇచ్చి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని ఆరోపించారు. గ్రామంలో ఎవరైనా ఇళ్లు కట్టుకోవాలన్నా, ఏదైనా పొలం సాగు చేసుకోవాలన్నా, బోరు వేసుకోవాలన్నా వారిని ఆ పనులు చేయకుండా అడ్డుపడుతూ తహశీల్దార్‌ కార్యాలయం, వ ుండల పరిషత్‌ కార్యాలయాలలో తప్పుడు ఫిర్యాదులు చేస్తూ గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. అక్రమాలపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేస్తే రాత్రి అవగానే ఎస్సీ, ఎస్టీలకు మద్యం తాపించి గ్రామంపైకి ఎగదొలి నానా బూతులు కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కనీసం జగనన్న ఇళ్ల్లు కూడా గ్రామంలో ఎవరిని కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతూ ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. అంతేగాక గుండ్లూరు వద్ద గుడి జాగాలో వచ్చే ఆదాయాన్ని కాజేసి స్వాహా చేశారంటూ ఆరోపించారు. మా బావ దగ్గర సంతకం పెట్టించుకుని, తప్పుడు ప్రచారం చేస్తూ వేధింపులు గురి చేస్తున్నారని ఈశ్వరమ్మ, సుశీలమ్మలు చెప్పారు. గ్రామస్తులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వరదప్పగారి వరదారెడ్డి, ఆయన కుమారుడు వెంకటేశ్వర్‌ రెడ్డి భారి నుండి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వారు కోరారు.

➡️