మరో అన్న క్యాంటీన్‌ ప్రారంభిస్తా..

Jun 16,2024 22:14
ఫొటో : మాట్లాడుతున్న ఎం.ఎల్‌.ఎ. దగ్గుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎం.ఎల్‌.ఎ. దగ్గుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

మరో అన్న క్యాంటీన్‌ ప్రారంభిస్తా..

ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలో 2వ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటుకు కృషి చేస్తానని కావలి ఎం.ఎల్‌.ఎ. దగ్గుమాటి వెంకట క్రిష్ణారెడ్డి హామీనిచ్చారు. ఆదివారం కావలి టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలుపై తొలి సంతకాలతో చంద్రబాబు పాలన ప్రారంభమైందన్నారు. భావితరాలకు మెరుగైన భవిష్యత్‌ కోసం పటిష్టమైన విద్యావ్యవస్థలో భాగంగా ఉపాధ్యాయ నియామకాలకు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా ఏకంగా 16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేలా ‘మెగా డిఎస్‌సి’ని ప్రకటిస్తూ, మొదటి సంతకం ఆ ఫైల్‌పైనే చేశారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2016లో 8,926 పోస్టులు, 2018లో 7,902 పోస్టులు మొత్తం 16,828 డిఎస్‌సి పోస్టులు ప్రకటించగా నేడు ఒకేసారి ఇన్ని పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. యేటా డిఎస్‌సి, జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని హామీనిచ్చిన జగన్‌ రెడ్డి ఒక్కపోస్టు, ఒక్క క్యాలెండర్‌ ఇవ్వకుండా నిరుద్యోగులు, యువతను మోసగించారన్నారు. అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ మేరకు రెండో సంతకాన్ని ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై పెట్టి రద్దు చేశారన్నారు. పేదల పింఛన్‌ మొత్తాన్ని రూ.3వేల నుంచి ఒకేసారి రూ.4వేలకు పెంచారన్నారు. 2019లోనే చంద్రబాబు పింఛను రూ.2వేలు చేశారని, దానిని 3వేలకు పెంచుతామని చెప్పి, అధికారంలోకి వచ్చిన జగన్‌ విడతల వారీ పాట పాడారన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఒకే విడతలో రూ.1000 పెంచడంతో 66లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. మేం అధికారంలోకి వస్తే ఏప్రిల్‌ నుంచే పెరిగిన పింఛను అమలు చేస్తామని, ఈ మొత్తాన్ని కూడా కలిపి జూలైలో రూ.7వేలు ఇస్తామని హామీనిచ్చారన్నారు. జూలైలో ఈ 3నెలల బకాయి రూ.3వేలు, పెరిగిన పింఛను రూ.4వేలు కలిపి మొత్తం రూ.7వేలు అందించేందుకు మూడో సంతకం చేయడంతో వృద్ధుల్లో బోసి నవ్వులు విరబూశాయన్నారు. అలాగే దివ్యాంగుల పింఛను రూ.4వేల నుంచి రూ.6వేలకు పెంచుతున్నారన్నారు. వారికి బకాయిలతో కలిపి జూలైలో రూ.12వేలు అందుతుందన్నారు. రాష్ట్రంలో 310 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 1400 డిగ్రీ కళాశాలలు, 267 పాలిటెక్నిక్‌లు, 516 ఐటిఐలు ఉన్నాయన్నారు. వీటి నుంచి యేటా 4.4 లక్షలమంది విద్యార్థులు బయటకు వస్తున్నా, సరైన నైపుణ్యాలు లేక చాలామంది నిరుద్యోగులుగానే మిగులుతున్నారన్నారు. వీరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి.. పరి శ్రమల అవసరాలకు అనుగుణంగా ఎలాంటి నైపుణ్యాలు అవసరమో నైపుణ్య గణన గుర్తిస్తుందన్నారు. పోటీకి అనుగుణంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సిఫార్సులు చేస్తుందన్నారు. నిర్మాణ, ఉత్పత్తి, సేవా రంగాలకు సంబంధించి యువతలో ఏ మేరకు నైపుణ్యాలు ఉన్నాయో గుర్తిస్తారన్నారు. పరిశ్రమల అవసరాలు, యువతకు మధ్య ఉన్న నైపుణ్య అంతరాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి సిఎం చంద్రబాబు నాల్గో సంతకం పెట్టి యువతకు మెరుగైన బాట వేశారన్నారు. జగన్‌ రాగానే మూసేసిన ‘అన్న క్యాంటీన్ల’ను పునరుద్ధరిస్తూ చంద్రబాబు ఐదో సంతకం చేశారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం, అల్పాహారాన్ని రూ.5కే అందించిందన్నారు. పేదలు, కూలీలతోపాటు వివిధ పనులపై పట్టణాలకు వచ్చే ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించారన్నారు. టిడిపి ప్రభుత్వానికి బ్రాండ్‌గా నిలిచిన అన్న క్యాంటీన్లను జగన్‌ రెడ్డి మూసి వేయించారన్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించి దశలవారీగా మిగిలిన వాటిని అందుబాటులోకి తేవాలని సిఎం చంద్రబాబు ఉత్తర్వులు విడుదల చేశారన్నారు. కావలి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్‌ సమీపంలో మరో అన్న క్యాంటీన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందనుందని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరనుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టనుందన్నారు. కావలి నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రతిఒక్కరి రుణం తీర్చుకునేలా కావలిని అభివృద్ధి చేసి చూపుతానని తెలిపారు. జిల్లా నుండి మంత్రులుగా ఎంపికైన మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు అభినందనలు తెలిపారు. ప్రతిఒక్కరూ ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించేలా కృషి చేస్తానని, ఎలాంటి సమస్య వచ్చినా టిడిపి కార్యాలయం అండగా ఉంటుందన్నారు. ప్రజలు ఎప్పుడైనా తనను కలవవచ్చని, మధ్యవర్తులు ఎవరూ ఉండరని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తానని, ఏ పేదవాడికి అన్యాయం జరిగిన సహించనన్నారు. తనను కలవడానికి వచ్చే ప్రజలు శాలువాలు, పూలమాలలు, బొకేలు తీసుకురావద్దని, మీ కుటుంబ సభ్యునిగా భావిస్తే చాలని తెలిపారు. ప్రజలందరం కలిసి కావలిని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి అలేఖ్య, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్‌కుమార్‌ యాదవ్‌, బిజెపి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం, టిడిపి నాయకులు తిరివీధి ప్రసాద్‌, తటవర్తి వాసు, బొంత శ్రీనివాస్‌యాదవ్‌, శాంతికుమార్‌, షేక్‌ షాన్వాజ్‌, దేవరకొండ శ్రీను, ఆళ్ల శ్రీను, వల్లేరి వెంకటకిరణ్‌ కుమార్‌, సురేష్‌, జవంగుల మల్లికార్జున రావు, వేణు, టిడిపి బిజెపి జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️