నకిలీల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

May 17,2024 21:26

స్వాధీనం చేసుకున్న నకిలీ బయో మందులు (ఫైల్‌)
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
నకిలీ విత్తనాల తయారీ, విక్రేతలపై క్రిమినల్‌ కేసులు నమోదుతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఐ.మురళి అన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తన దుకాణాలపై విస్తృతంగా తనిఖీలు చేస్తామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై ఆయన ప్రజాశక్తితో ప్రత్యేకంగా మాట్లాడారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. సాగు సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిఊఆరు. నకిలీ విత్తనాల ఉత్పత్తి, సరఫరా, విక్రయాలను అరికట్టడానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ శాఖతో కలిసి ప్రత్యేక స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు, అవగాహన సదస్సు నిర్వహిస్తామని అన్నారు. నకిలీలపై సమాచారం అందితే తక్షణమే తమ పరిధిలోని వ్యవసాయాధికారికి సమాచారం ఇవ్వాలని కోరారు. గుర్తింపు పొందిన డీలర్‌ వద్ద మాత్రమే విత్తనాలు కొనాలని, రసీదు తప్పకుండా తీసుకొని దానితోపాటు విత్తన సంచులను పంట కాలం పూర్తయ్యే వరకూ భద్రపరచాలని రైతులకు సూచించారు.

➡️