నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

May 21,2024 21:22

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఇహెచ్‌ఎస్‌ సేవలకు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి వైద్య సేవలను నిలుపుదల చేయనున్నాయి. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ఇప్పటికీ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ నెట్‌ వర్కు ఉన్న ఆస్పత్రులన్నీ సేవలను నిలుపుదల చేయనున్నట్లు ఆ యూనియన్‌ తెలిపింది. ఈమేరకు విజయనగరం ఉమ్మడి జిల్లాలో కూడా ఈ సేవలను నిలుపుదల చేయనున్నారు. జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో ఇప్పటికే పలుమార్లు ఆస్పత్రుల యాజమాన్యాలు తమ సేవలను నిలుపుదల చేయడం, ప్రభుత్వం బిల్లులు చెల్లించిన తరువాత తిరిగి పునరుద్దరించడం జరుగుతోంది. తాజాగా ఆరు నెలలుగా ఆస్పత్రులకు బిల్లులు చెల్లించక పోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ తమ సేవలను నిలుపుదల చేయనున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ 600కు పైబడి ఉన్నాయి. విజయనగరం ఉమ్మడి జిల్లాలో 16 ఆస్పత్రులు ఉన్నాయి. వీటన్నింటికీ 2023 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.1500కోట్ల రూపాయలు, విజయనగరం జిల్లాకు సుమారు రూ.70కోట్లు వరకు బకాయిలు ఉన్నాయి. దీంతో యాజమాన్యాలు డబ్బులు రాకపోతే హాస్పిటల్స్‌ను ఎలా నడపాలని, రోగులకు ఎలా సేవాలందించాలని ప్రశ్నిస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి. అయినా స్పందన లేకపోవడంతో సేవలను నిలుపుదల చేయాలని నిర్ణయించాయి. బిల్లులు చెల్లించకపోతే, ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు నెట్‌వర్కు ఆస్పత్రులు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు కూడా సేవలను బంద్‌ చేయనున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే అత్యవసర రోగులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.

➡️