వైసిపి కార్యకర్తపై దాడి అమానుషం

Jun 16,2024 21:23

ప్రజాశక్తి – పాచిపెంట: వైసిపి కార్యకర్తలపై టిడిపి కార్యకర్తలు దాడులు చేస్తే సహించేదిలేదని మాజీ ఉపముఖ్యమంత్రి పి.రాజన్నదొర హెచ్చరించారు. పాచిపెంటకు చెందిన వైసిపి సోషల్‌ మీడియా కన్వీనర్‌గా పనిచేస్తున్న రౌతు సాగర్‌ రెడ్డి ఇంటికి టిడిపికి చెందిన సూర్యనారాయణ వెళ్లి దాడికి పాల్పడడం అమానుషమన్నారు. ఇంటికి వెళ్లి దాడి చేసి గాయపర్చడం న్యాయమా అని ప్రశ్నించారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి యుతంగా పరిపాలన చేపడతామంటూ మరోపక్క వైసిపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెడతామంటూ ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. దాడులకు పాల్పడడమేనా మీరు ప్రేరేపిస్తున్న శాంతి అని మండిపడ్డారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఇటువంటి దాడులను ప్రేరేపించలేదన్నారు. ఇటువంటి సంస్కృతి నియోజకవర్గంలో ఎప్పుడూ లేదన్నారు. తక్షణమే పోలీసులు దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలన్నారు. ఒక సీనియర్‌ నాయకుడిగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశంతో తమ కార్యకర్తపై దాడి జరిగినప్పటికీ పరామర్శకు వెళ్లడంలేదని అన్నారు. పరామర్శకు వెళ్తే తన వెంట వందలా మంది కార్యకర్తలు వస్తారని, అప్పుడు శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్నారు. ఆ సమస్య తలెత్తకముందే నిందితుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి దాడులకు పాల్పడితే భయపడేది లేదని, మీరు యుద్ధం చేస్తే మేము కూడా యుద్ధానికి సిద్ధమేనని హెచ్చరించారు. కావున టిడిపి నాయకులు, కార్యకర్తలు భవిష్యత్తులో దాడులు మానుకోవాలని కోరారు.

➡️