పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఎరలు..!

May 7,2024 10:19

అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈనెల 13వ తేదీన సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి ఓటు హక్కును ముందుగానే వినియోగించుకు అకవాశాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో కల్పించారు. ఎప్పుడూ లేని విధంగా 85 సంవత్సరాలు పైబడిన వారు వికలాంగులైన వారికి హోం ఓటింగ్‌ ప్రక్రియ కూడా నడుస్తోంది. ఇవన్నీ ఈనెల 10వ తేదీలోపు పూర్తి కావాల్సి ఉంది. ఈ మేరకు ఫారం 12ను అందజేసిన వారికి ఎప్పుడు… ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అన్న షెడ్యుల్‌ను ఎన్నికల అధికారులు ఇచ్చారు. ఈ మేరకు ఈనెల 3వ తేదీ నుంచే ఉమ్మడి జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభమైంది. దీనిపై మొదట్లో కొంత సందేహాలు, గందరగోళం కూడా నెలకొంది. వాటిని ఎన్నికల అధికారులు ఇప్పటికీ కొంత వరకు నివృత్తి చేసినట్టుగానే కనిపిస్తోంది.

మొదలైన ఎరలు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ మొదలవడంతో ఎరలు మొదలయ్యాయి. తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు అభ్యర్థులు తమతమ స్థాయిల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రధానంగా ఈ ఓటింగ్‌లో పాల్గొనేది ఉద్యోగులే కాబట్టి వారిని గుర్తించి అవసరమైన మేరకు డబ్బులిచ్చి తమకు ఓటు వేయాలన్న ప్రలోభాలు మొదలయ్యాయి. ఈ రకంగా మొదలైన ప్రలోభాలు కళ్యాణదుర్గంలో ఉద్రిక్తతలకు దారి తీశాయి. అధికార వైసిపి నాయకులు తమ పార్టీకి ఓటు వేయాలని ఉద్యోగులకు డబ్బులతో ఎర వేస్తున్న సమయంలో టిడిపి నాయకులు గుర్తించి అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో ఘర్షణ వాతవరణం చోటు చేసుకుంది. ఇకపోతే అనంతపురంలో తిరస్కరించడం చర్చనీయాంశం అయ్యింది. ఇలా చాలా చోట్ల గుట్టుగా పోస్టల్‌ బ్యాలెట్‌లను కొనుగోలు చేసే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి 40.15 శాతం ఓటింగ్‌అనంతపురం జిల్లా పరిధిలోకి వచ్చే ఎనిమిది నియోజకవర్గాలతోపాటు ఇక్కడ ఓటు ఉండి ఇతర జిల్లాలోనున్న ఉద్యోగులు అందరివీ కలిపి మొత్తం 26,150 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారున్నారు. ఇందులో చూస్తే ఇప్పటి వరకు 10,499 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 40.15 శాతం మంది ఇప్పటి వరకు ఓటును వేసియున్నారు. ఇంకా ఇందులో అత్యధికంగా తాడిపత్రిలో 50 శాతం ఓటింగ్‌ జరిగింది. ఈ నియోజకవర్గం పరిధిలో 2388 ఓటర్లు ఉండగా 1200 ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం అర్బన్‌లో 6594 మంది ఓటర్లకుగానూ 2773 మంది ఓటు వేశారు. ఇక్కడ 42.06 శాతం ఓటింగ్‌ ఇప్పటి వరకు జరిగింది. ఇక రాప్తాడులో 3528 మంది ఓటర్లకుగానూ 1377 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉరవకొండలో 2124 ఓట్లకుగానూ 909 మంది ఓట్లు వేశారు. గుంతకల్లులో 3032 మంది ఓటర్లకుగానూ 1366 మంది ఓట్లు వేశారు. శింగనమలలో 1810 ఓట్లకుగానూ 680 మంది, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2566 ఓట్లకుగానూ 948 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాయదుర్గంలో 1877 ఓట్లకుగానూ 579 ఓట్లు వేశారు. ఈనెల 10వ తేది వరకు సమయముండటంతో ఆలోపు ఓటింగు శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయి.

➡️