అర్చకులపై దాడి అమానుషం

Mar 28,2024 00:03 ##repalle #Shivalayam

ప్రజాశక్తి – రేపల్లె
శివాలయ అర్చకులపై దాడి అమానుషమని బ్రాహ్మణ సంక్షేమ సమైక్య సభ్యులు సివి మోహనరావు పేర్కొన్నారు. కాకినాడ శివాలయంలో సోమవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న అర్చకులపై కాకినాడ మాజీ కార్పొరేటర్ పరుష పదజాలంతో దూషిస్తూ అర్చకులపై చేసిన దాడికి నిరసన తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దారుకు వినతి పత్రం బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడకు చెందిన మాజీ కార్పొరేటర్ శివాలయంలోనికి వచ్చి తను ఇచ్చిన పాలు శివలింగంపై సరిగా పోయలేదని గర్భగుడి వద్ద విధులు నిర్వహిస్తున్న అర్చకులు వెంకట సత్యసాయిపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. ఆలయంలోనే ప్రక్కన ఉపాలయంలో పనిచేస్తున్న సహాయ అర్చకులు మద్దిరాల విజయ్ కుమార్ అడ్డురాగా అతనినీ అసభ్య పదజాలంతో దూషించి చేయిజేసుకోవటం దుర్మార్గమని అన్నారు. అర్చకులను బెదిరించి, కొట్టిన మాజీ కార్పొరేటర్ చందర్రావు మీద వెంటనే చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. అర్చకులకు సరైన రక్షణ కల్పించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముదస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిందితునిపై చర్యలు తీసుకునే వరకు ఆలయాలలో పౌరోహిత్యం ఆపివేస్తామని, ఆలయాలను మూసివేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొట్టారు పూర్ణచంద్రరావు, అగస్త్య, చావలి సురేష్ శర్మ, నాగశ్రీ పాల్గొన్నారు.

➡️