సమ్మె విరమించే ప్రసక్తే లేదు..

Dec 22,2023 16:10 #Bapatla District
bapatla anganwadi workers strike on 11th day bus

మార్టూరులో జాతీయ రహదారిపై రాస్తారోకో

నిలిచిన మంత్రి సీదిరి అప్పలరాజు కాన్వాయ్..

రాస్తారోకో ఆపాలంటూ సిఐటియు నాయకులతో ఎస్కార్ట్ సిబ్బంది వాగ్వాదం

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : అంగన్వాడీల ప్రధాన సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక దీక్ష శుక్రవారంతో 11వ రోజుకు చేరుకుంది. మార్టూరు తహాశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె శిబిరానికి అంగన్ వాడీలు పెద్ద సంఖ్యలో వచ్చి నిరసనలో పాల్గొన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై అంగన్ వాడీలు రాస్తారోకో చేపట్టడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.

వెంటనే ఖాళి చేయాలి : మంత్రి సీదిరి అప్పలరాజు కాన్వాయ్ సిబ్బంది హుకుం

శ్రీకాకుళం నుండి తిరుపతి వెళుతున్నమత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కాన్వాయ్ అంగన్వాడీలు జాతీయరహదారిపై రాస్తారోకో చేస్తున్న సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకు పోయింది. మంత్రి కాన్వాయ్ కి చెందిన పోలీస్ లు వెంటనే రాస్తారోకో నిలిపి వేయాలని అంగన్ వాడీలను హెచ్చరించారు. తమ డిమాండ్ల పరిస్కారం కోసం అంగన్ వాడి కార్యకర్తలు,ఆయాలు రోడ్డుపైకి రాక తప్పలేదని రైతుసంఘం నాయకులు ఎనికపాటి రాంబాబు ఎస్కార్ట్ పోలీస్ లకు ధీటుగా సమాధానం చెప్పడంతో చేసేది లేక పోలీసులు వెనక్కి తగ్గారు. మంత్రి కనీసం కారు దిగకుండా ఉండటంతో తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినదించారు.

➡️