నష్టపరిహారం కౌలు రైతులకీ ఇవ్వాలి

Dec 8,2023 22:40

ప్రజాశక్తి – పంగులూరు
తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట నష్టపరిహారం కౌలు రైతులకూ ఇవ్వాలని కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్ బాబు డిమాండ్ చేశారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా మండలంలోని తూర్పు కొప్పెరపాడులో దెబ్బతిన్న పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. తుఫాను కారణంగా మిర్చి, పొగాకు, మినుము, శనగ, వరి మొదలైన పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. దీనివలన కౌలు రైతులు రూ.లక్షలు నష్టపోయారని అన్నారు. జిల్లాలో 60శాతం మంది కౌలు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వీరంతా పేదలేనని అన్నారు. 80శాతం భూమి కౌలు రైతుల కష్టంతోటే సాగవుతుందని అన్నారు. అందువలన నష్ట పరిహారాన్ని కౌలు రైతులకు ఇవ్వాలని కోరారు. కొంతమంది భూ యజమానులు తమ భూములను కౌలుకి ఇచ్చినా, వాళ్లు కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇప్పించేందుకు సహకరించటం లేదని తెలిపారు. దీనిని సాకుగా తీసుకొని అధికారులు కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వకపోగా ఈ క్రాప్ కూడా భూ యజమానుల పేరు మీదే చేస్తున్నారని తెలిపారు. కష్టపడి, పెట్టుబడి పెట్టి సాగు చేసిన కౌలు రైతుకు నష్టపరిహారం అందే పరిస్థితి కానరావడం లేదని తెలిపారు. సాగు చేయకుండా భూ యజమానులు పంట నష్ట పరిహారం కూడా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నిజమైన కౌలు రైతుల పేరుతో ఈక్రాప్ చేయాలని అన్నారు. కొప్పెరపాడు గ్రామంలో 200ఎకరాల్లో పొగాకు, 100ఎకరాల్లో మిర్చి, 300ఎకరాల్లో శనగ పంటను కౌలు రైతులు సాగు చేశారని చెప్పారు. ఈ క్రాప్‌తో సంబంధం లేకుండా రైతులు అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కౌలు రైతులు పాలపర్తి అబ్రహం, కుంట ఆదామ్, పాలపర్తి బాబు, ఎడ్లూరి శేషయ్య, పాలపర్తి శేషగిరి, పాలపర్తి రాంబాబు పాల్గొన్నారు.


అద్దంకి : తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని చెల్లించి రైతులను ఆదుకోవాలని సిపిఎం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో పొగాకు, మిర్చి పంటలను సిపిఎం నాయకులు పొనకా రామాంజనేయులుతో కలిసి పరిశీలించారు. మండలంలో అనేక గ్రామాలలో రైతులు వేసిన పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఎకరాకి రూ.50వేలు నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. మొక్కజొన్న, వరి, ఇతర మెట్ట పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. కౌవులు రైతులు అధికంగా ఉన్నారని చెప్పారు. కౌలు రైతులను గుర్తించి నష్టపరాహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పర్సంటేజీ ఆధారంగా నష్టం పరిహారం అంచనా వేసే విధానాన్ని మార్చుకోవాలని కోరారు. 30 శాతంపైగా నష్టం జరిగితేనే పరిహారం ఇస్తామని చెప్పడం బాధాకరమని అన్నారు. ఎంత నష్టం జరిగితే అంత నష్టాన్ని ఇవ్వాలని కోరారు. తప్పించుకునేందుకే ప్రభుత్వం పర్సంటేజీ విధానం ముందుకు తెచ్చిందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు. తమ పర్యటనల్లో గుర్తించిన నష్టాన్ని అంచనా వేసి అధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. గ్రామాల్లో రైతులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. వెంటనే గ్రామాలకు అధికారులు వచ్చి దెబ్బతిన్న పంటలను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలా కానీ పక్షంలో ఆందోళన పోరాటాలకి సిద్ధం కావాలని రైతులను కోరారు.


రేపల్లె : తూఫాన్ వల్ల పంట నష్టం పరిశీలనకు వచ్చిన సిఎం వైఎస్‌ జగన్‌ కౌలుకార్డు లేని కౌలు రైతులు, పోరంబోకు భూములు, దేవాలయ భూముల్లో సాగు చేస్తున్నవారికి కూడా నష్టపరిహారం ఇచ్చే అంశం ప్రస్తావించకపోవడం బాధాకరమని సిపిఎం కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ పేర్కొన్నారు. నష్ట పరిహారం నష్టపోయిన ప్రతి ఎకరాకు చెల్లిస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని కోరారు. నల్లురిపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన కౌలు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కార్మికులు, సన్నకారు రైతులు పెట్టుబడి పెట్టి, వ్యవసాయం చేస్తూ తుఫాన్ ప్రభావం వల్ల సర్వం కొల్పయారని చెప్పారు. కానీ వీరికి నష్ట పరిహారం ఇవ్వకుండా అనర్హులను చేస్తున్నారని అన్నారు. పరిశీలకు వచ్చే రెవెన్యూ సిబ్బంది వీళ్ల పేర్లు నమోదు చేయడం లేదని చెప్పడంతో ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. మండలంలోని నల్లూరిపాలెం, సింగుపాలెం బాడే, జన్నే కాలువ పరిధిలో దాదాపు 100ఏళ్ల నుంచి పోరంబోకు భూములుసాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా పన్ను కూడా కట్టించుకోవటం లేదని తెలిపారు. దీంతో ప్రభుత్వ నుండి వ్యవసాయంకు అందే రాయితీలు అందటం లేదని తెలిపారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూముల్లో సాగు చేసుకుంటున్న వారికీ నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కౌలు రైతుల కార్డులు లేకపోవటంతో నష్టపరిహారం పొందటానికి అనర్హులు అవుతున్నారని తెలిపారు. కౌలు రైతు కార్డుతో సంబంధం లేకుండా కౌలు రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా విఆర్ఓతో పరిశీలన చేయించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం అందకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో నల్లూరిపాలెం కౌలు రైతులు డి బాబురావు, కె మరిదాసు పాల్గొన్నారు.

➡️